రెడ్ల‌కు గేలం.. కేసీఆర్ వ్యూహం అద‌ర‌హో!

ఎన్నిక‌లు ఎన్నిక‌లే. రాజ‌కీయాలు రాజ‌కీయాలే! ఏ ఒక్క విష‌యాన్నీ వ‌దులుకునేందుకు అధికార పార్టీ బీఆర్ ఎస్ సిద్ధంగా లేదు. అందుకే.. అందిన ప్ర‌తి విష‌యాన్నీ త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు రెడీ అవుతోంది. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్‌ను దెబ్బ‌కొట్టేందుకు కేసీఆర్ చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నాలు ఆయ‌న ముమ్మ‌రం చేసిన‌ట్టు తెలుస్తోంది.

రెడ్డి ట్యాగ్ ఉన్న‌వారు ఎవ‌రు వ‌చ్చినా.. వారి వెనుక ఏముంది? ప్ర‌జ‌ల‌ను క‌దిలించ‌గ‌ల‌రా? ఓట్లు వేయించ‌గలరా? అనే విష‌యాల‌ను ప‌క్క‌న పెట్టేసి.. వారు వ‌స్తే చాలు కండువా క‌ప్పేయ‌డ‌మే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తు న్నార‌ని ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.. త‌న సామాజిక వ‌ర్గాన్ని అనున‌యిస్తున్నారు. అంతేకాదు.. కాంగ్రెస్ అంటేనే రెడ్ల‌కు కంచుకోట అనే టాక్ ఉంది. గ‌త 2018 ఎన్నిక‌ల్లో కూడా రెడ్డి వ‌ర్గం కాంగ్రెస్ వైపునే ఉన్నా.. అప్ప‌ట్లో పొత్తులు విక‌టించి.. రెడ్డి వ‌ర్గం దూర‌మైంది.

ఇది కేసీఆర్‌కు ప‌రోక్షంగా మేలు చేసిందనే టాక్ ఉంది. ఇక‌, ఇప్పుడు కాంగ్రెస్ దాదాపు ఒంట‌రిగానే ముందుకు సాగుతోంది. ఒక‌టి రెండు జిల్లాల్లో మాత్రమే క‌మ్యూనిస్టుల‌తో చేతులు క‌లుపుతోంది. వెర‌సి మొత్తంగా రెడ్డి సామాజిక వ‌ర్గం ఓట్ల‌ను క‌ద‌ల‌బార‌కుండా.. కాంగ్రెస్ ఎత్తులు వేస్తోంది. దీనిని గ‌మ‌నించిన కేసీఆర్ అదే ఓటు బ్యాంకును త‌న‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు. ఈ క్ర‌మంలోనే పెద్ద‌గా ప్ర‌జ‌ల్లో లేని నాయ‌కుల‌ను కూడా ఆయ‌న పిలిచి మ‌రీ కండువాలు క‌ప్పుతున్నారు.

వీరిలో మాజీ ఎమ్మెల్యే జిట్టా బాల‌కృష్నారెడ్డి, రావుల చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి వంటివారు ఉన్నారు. వీరికి ఇప్పుడు ప్ర‌జ‌ల్లో పెద్దగా ఫాలోయింగ్ లేదు. అయినా కూడా రెడ్డి ట్యాగ్ ఉండ‌డంతో ఆ సామాజిక వ‌ర్గాన్ని ఆక‌ర్షించేందుకు వీరిని తురుపు ముక్క‌ల్లా వాడుకునే వ్యూహంతోనే కేసీఆర్ వీరికి ఎన్నిక‌ల ముంగిట కండువాలు క‌ప్పేశారు. వీరికిటికెట్లు ఇవ్వ‌రు. రేపు మ‌రోసారి ప్ర‌భుత్వం వ‌స్తే.. నామినేటెడ్ ప‌ద‌వులు ద‌క్కుతాయి. కానీ, ఈలోపు మాత్రం వీరు రెడ్డి వ‌ర్గాన్ని ఆక‌ర్షించాలి. కేసీఆర్ కు అనుకూలంగా, రేవంత్‌కు వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్పాలి. ఇదీ టాస్క్‌. మొత్తానికి గ‌తానికి భిన్నంగా రెడ్డివ‌ర్గానికి కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తుండ‌డం ఇప్పుడు ఆస‌క్తిగా మారింది.