తెలంగాణ అధికార పార్టీ బీఆర్ ఎస్.. పక్కా ప్లానింగ్‌తో ఎన్నికలకు వెళ్తోందని అంటున్నారు పరిశీలకులు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇప్పటికే రెండు సార్లు అధికారం దక్కించుకున్న బీఆర్ ఎస్(ఒకప్పటి టీఆర్ఎస్) మూడో సారి కూడా దానిని పదిలపరుచుకుని సీఎం కేసీఆర్ హవాకు తిరుగులేదనే సంకేతాలను పంపించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. అయితే.. సహజంగానే ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకత, అసంతృప్తి వంటివి బీఆర్ఎస్ సర్కారును కూడా వెంటాడుతున్నాయి.
ఇదేసమయంలో కీలకమైన బీజేపీ, కాంగ్రెస్‌లు అధికారం కోసం ఉవ్విళ్లూరుతూ.. సర్కారుపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత రెండు ఎన్నికలకు భిన్నంగా ఇప్పుడు బీఆర్ఎస్ పక్కా ప్లానింగ్‌తో పావులు కదుపుతోంది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందుగానే దాదాపు అన్నినియోజకవర్గాల్లోనూ(కొన్ని మినహా) అభ్యర్థులను ప్రకటించేసింది. ఇక, వారి పనితీరుపైనా సీఎం కేసీఆర్ నుంచి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వరకు కూడా పక్కా పరిశీలన చేస్తున్నారు. వీటికి తోడు త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.
1) చేరికలు: ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్.. అధికారంలోకి రావడంపై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో సాధ్యమైనంత వరకు ఆ పార్టీని బలహీన పరిచేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందనే వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్‌లో టికెట్ రాదని భావిస్తున్నవారిని, టికెట్ ఆశించి కూడా వెనక్కి తగ్గుతున్న వారిని, కుల సమీకరణల ఆధారంగా కూడా.. కొందరిని పార్టీలో చేర్చుకుంటోంది. తద్వారా.. కాంగ్రెస్ బలహీనపడేలా వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ ముందుకు సాగుతోంది.
2) బుజ్జగింపులు: బీఆర్ ఎస్‌లోనే అసంతృప్తిగా ఉన్న నాయకులను ఎలాంటి భేషజాలు లేకుండా… పార్టీ బుజ్జగిస్తోంది. అసంతృప్తి పొడ చూపుతోంది.. అన్న వార్త వస్తే చాలు.. మంత్రి కేటీఆర్ లేదా హరీష్ రావు వంటివారు.. ఆయా నేతల ఇళ్లపై వాలిపోతున్నారు. వారిని బుజ్జగిస్తున్నారు. పార్టీ కోసం పనిచేసేలా వారిని అనునయిస్తూ.. ఎక్కడా మచ్చుకైనా అసంతృప్తి లేకుండా చూసుకుంటున్నారు. ఇది కూడా పార్టీకి మేలు చేసే అవకాశం ఉందని అంటున్నారు.
3) హామీలు: ఎన్నికల వేళ సహజంగా ఏ పార్టీ అయినా.. ప్రజలకు హామీలు ఇస్తుంది. మేనిఫెస్టోల పేరుతో ఉచితాల వర్షం కురిపిస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఇటు ప్రజలు-అటు నాయకులు అంటూ..రెండు రకాల మేనిఫెస్టోలను రూపొందిస్తోందని తెలుస్తోంది. ప్రజల కోసం ఇచ్చే హామీల మాదిరిగానే పార్టీ నాయకులను సంతృప్తి పరిచేందుకు.. పార్టీని మూడో సారి కూడా అధికారంలోకి తెచ్చేలా వారిని కార్యోన్ముఖులను చేసేందుకు నామినేటెడ్ పదవులు, పోస్టుల హామీలు గుప్పిస్తోంది. మొత్తంగా ఈ త్రిముఖ వ్యూహంతో బీఆర్ ఎస్ దూకుడుగా ముందుకు సాగుతుండడం గమనార్హం.