సంక్షేమ పథకాల ఫలాలు అర్హులందరికీ చేరాలని బీఆర్ఎస్ నేత, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. దళిత బంధు, గృహలక్ష్మి పథకాల కోసం లంచం అడుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, లబ్దిదారుల నుంచి కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయని ఆయన అన్నారు. ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని, లంచం అడిగితే తనకు చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. అలా డబ్బులు వసూలు చేసే వారి బట్టలు ఊడదీయిస్తానని కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యే రాజయ్య, పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకారంతో స్టేషన్ ఘన్‌పూర్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. రాష్ట్రంలోనే స్టేషన్ ఘన్‌పూర్‌ను నెం.1గా తీర్చిదిద్దుతానని కడియం శ్రీహరి చెప్పారు. మరోవైపు కడియం శ్రీహరిపై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి ఎందుకు అభద్రతాభావంలో ఉన్నారో తనకు అర్థం కావడంలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు.
నియోజకవర్గంలో కష్టమైన పరిస్థితులున్నాయని, డప్పు కొట్టాలన్నా, ఫ్లెక్సీలు కట్టలన్నా ప్రజలు భయపడుతున్నారని చెప్పారు. నూతన పంచాయతీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాజయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే కడియం శ్రీహరి వర్సెస్ రాజయ్య అన్న రీతిలో చాలాకాలంగా మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో వారిద్దరి మధ్య సయోధ్యకు కేటీఆర్ ప్రయత్నించారు. ఇక, టికెట్ కూడా రాకపోవడంతో రాజయ్య కాస్త అసహనానికి లోనై ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.