ఓటుకు నోటు కేసు..రేవంత్ రెడ్డికి సుప్రీం షాక్

తెలంగాణ రాజకీయాలలో ఓటుకు నోటు కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఓటుకు నోటు వ్యవహారంలో అప్పటి టీడీపీ నేత, ఇప్పటి టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పేరు కూడా బలంగా వినిపించడం సంచలనం రేపింది. అయితే, ఆ కేసు చాలా కాలంగా కోల్డ్ స్టోరేజిలో ఉండిపోయింది. తెలంగాణలో శాసనసభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో తాజాగా ఆ కేసుకు సంబంధించి కీలక పరిణామం జరిగింది.

ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదంటూ సుప్రీంకోర్టులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేయడం సంచలనం రేపింది. ఇదే విషయంపై గతంలో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. తాజాగా ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు దానిని కొట్టివేసింది. ఇక, ఇదే కేసులో సండ్ర వెంకటవీరయ్య వేసిన పిటిషన్‌పై విచారణను డిసెంబర్ 4కు దేశపు అత్యున్నత న్యాయస్థానం వాయిదా వేసింది.

2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు వ్యవహారం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతివ్వాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌ వద్దకు రేవంత్ రెడ్డి వెళ్లి రూ.50 లక్షలు ఇవ్వజూపారని ఆరోపణలు వచ్చిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఆ కేసులో రేవంత్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.