కాంగ్రెస్ కి ఊపు తెప్పించే సర్వే

తెలంగాణ తో సహా తొందరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కాస్త అనుకూల పవనాలే వీస్తున్నట్లున్నాయి. తెలంగాణ తో కలిపి చత్తీస్ ఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం ఎన్నికలు జరగాల్సుంది. చత్తీస్ ఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలపై సర్వే సంస్ధలు ప్రీ పోల్ నిర్వహించాయి. పై మూడు రాష్ట్రాల్లో తమ సర్వే వివరాలను సంస్ధలు తాజాగా విడుదల చేశాయి. దాని ప్రకారం మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశముంది. రాజస్ధాన్లో కాంగ్రెస్-బీజేపీ మధ్య టఫ్ ఫైట్ జరిగే అవకాశముందట.

ఇక ఛత్తీస్ ఘడ్ లో అయితే కాంగ్రెస్సే మళ్ళీ అధికారంలోకి వస్తుందని తేలింది. మధ్యప్రదేశ్ లో 230 సీట్లున్నాయి. ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా మ్యాజిక్ ఫిగర్ 116 సీట్లు. ఈటీజీ అనే సంస్ధ చేసిన సర్వేలో బీజేపీ 105-110 మధ్య తెచ్చుకుంటుందట. అలాగే కాంగ్రెస్ 118-128 సీట్లలో గెలిచే అవకాశముందట. పీఇఏసీఎస్ మీడియా 24 అనే సంస్ధ సర్వేలో కూడా ఫైట్ రెండు పార్టీల మధ్య చాలా టైట్ గా ఉంటుందని తేలింది.

90 నీట్లున్న ఛత్తీస్ ఘడ్ లో అధికారంలోకి రావాలంటే 46 సీట్లు తెచ్చుకోవాలి. మ్యాజిక్ ఫిగర్ దాటి కాంగ్రెస్ 51 సీట్లు తెచ్చుకుంటుందని సర్వేలో తేలింది. బీజేపీ 38 సీట్లకే పరిమితమవుతుందని సర్వేలు చెబుతున్నాయి. మీడియా 24 అనే సంస్ధ సర్వేలో కాంగ్రెస్ కు 55-60 సీట్లు వస్తుందని తేలింది. బీజేపీకి 30-35 మధ్య వస్తుందని తేలిందట.

ఇక రాజస్థాన్ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా ఉండబోతోంది. 200 సీట్లున్న రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే 101 సీట్లు దాటాలి. ఇక్కడ బీజేపీకి 95-105 స్ధానాలు వచ్చే అవకాశముందట. కాంగ్రెస్ కు 91-101 సీట్ల మధ్య వచ్చే అవకాశముందని తేలింది. అయితే ఏ సంస్ధ కూడా తెలంగాణా, మిజోరం రాష్ట్రాల్లో సర్వేలు చేయలేదు. కారణం ఏమిటంటే కాంగ్రెస్-బీజేపీ ముఖాముఖి పోటీచేసే రాష్ట్రాల్లో మాత్రమే సర్వేలు చేసినట్లు ప్రకటించాయి.