రైతులకు పెన్షన్ పథకమా ?

తెలంగాణాలో రైతులకు పెన్షన్ పథకం అమలవ్వబోతోందా ? బీఆర్ఎస్ వర్గాల సమాచారం ప్రకారం కేసీయార్ ఈ మేరకు వర్కవుట్ చేస్తున్నారట. ఇప్పటికై రైతుల కోసం రైతుబంధు పథకాన్ని వర్తింప చేస్తున్నారు. అలాగే 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు రుణమాఫీని విడతల వారీగా అమలు చేస్తున్నారు. నిజానికి ఈ హామీనే కేసీఆర్ కు అతిపెద్ద తలనొప్పిగా తయారైంది. రాబోయే ఎన్నికల్లో ఓటమి భయంతోనే సడెన్ గా రుణమాఫీకి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఇది సరిపోదన్నట్లుగా రైతులకు పెన్షన్ ఇస్తే ఎలాగుంటుందన్న ఆలోచన చేస్తున్నారట. రైతులు, రైతు కుటుంబాల ఓట్లు సుమారుగా కోటికి పైగా ఉంటాయి. వీటిన్నింటిని సాలిడ్ గా వేయించుకోవాలంటే ఏదో ఒక కొత్త పథకాన్ని ప్రకటించాల్సిందే అని కేసీయార్ డిసైడ్ అయ్యారట. ఇప్పటికి అనేక కారణాలతో రైతులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ఇదే సమయంలో డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ రైతులను ఆకట్టుకునేందుకు హామీలను ఇస్తోంది. దానికి విరుగుడుగా రైతులకు నెలనెలా పెన్షన్ పథకాన్ని ప్రారంభించే విషయమై కేసీయార్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

వచ్చే నెల 16వ తేదీన వరంగల్లో బీఆర్ఎస్ నాయకత్వంలో భారీ బహిరంగసభ జరగబోతోంది. అప్పటికి రైతులకు పెన్షన్ పథకానికి ఒక రూపు ఇవ్వాలని కేసీయార్ అనుకున్నారట. అందుకనే రైతు సంఘాలు, వ్యవసాయ రంగంలోని నిపుణులు, ఆర్థికవేత్తలతో ఇప్పటికే చర్చలు మొదలుపెట్టినట్లు పార్టీ వర్గాల టాక్. అయితే కేసీఆర్ తో పెద్ద సమస్య ఉంది. అదేమిటంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆ తర్వాత పట్టించుకోరు.

ఎన్నికల సమయంలో వివిధ వర్గాల ఓట్లకోసం నోటికొచ్చిన హామీలు గుప్పించేస్తారు. అధికారంలోకి రాగానే హామీలను పట్టించుకోరు. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయని అనుకున్నపుడు మాత్రమే వాటిగురించి ఆలోచిస్తారు. రైతు రుణమాఫీ పథకం అమలే దీనికి మంచి ఉదాహరణ. అలాగే ఉద్యోగాల భర్తీకి కూడా ఎన్నో హామీలిచ్చి ఇంతవరకు సక్రమంగా ఒక్కటి అమలుచేయలేదు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ప్రకటించిన దళితబంధు పథకం అమలు ఏమైందో ఎవరికీ తెలీదు. కాబట్టి రేపటి రైతు పెన్షన్ పథకం కూడా ఇలాగే ఉంటుందనే ప్రచారమైతే మొదలైంది. మరి చివరకు కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి.