చంద్రబాబు అరెస్టు వైసీపీ వాళ్ళకీ నచ్చట్లేదా?

ఏపీలో అంతా రొటీన్ కు భిన్నంగా జరుగుతోంది. సాధారణంగా ఎవరైనా ప్రముఖుడిని అరెస్టు అయితే… అరెస్టు వేళలోనూ.. అరెస్టు జరిగిన ఒకట్రెండు రోజుల పాటు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవటం.. నిరసనలు.. ఆందోళనలు వెల్లువెత్తటం లాంటివి కామన్. అందుకు భిన్నంగా ఏపీ విపక్ష నేత.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు రోజు పెద్దగా ఏమీ జరగలేదు కానీ… తర్వాత రోజుల్లో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు అరెస్టు జరిగి దాదాపు రెండు వారాలు కావొస్తున్నా.. అరెస్టు వేళ కంటే ఎక్కువగా ఆందోళనలు.. నిరసనలు పెరుగుతున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అన్నింటికి మించి ఉమ్మడి ప్రకాశంజిల్లాలోని గిద్దలూరులో చోటు చేసుకున్న ఒక పరిణామం కొత్త ట్రెండ్ గా చెప్పాలి. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. గిద్దలూరుకు చెందిన అధికార వైసీపీ నేతలు పలువురు రాజీనామాలు చేసి.. మూకుమ్మడిగా టీడీపీలో చేరిన వైనం సంచలనమైంది. ఓ వైపు అధికార పార్టీకి చెందిన ముఖ్యులు రంగంలోకి దిగి.. ఈ డ్యామేజింగ్ పరిణామాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా సానుకూల ఫలితాల్ని ఇవ్వలేదు.

గిద్దలూరు తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి.. మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో గిద్దలూరు జెడ్పీటీసీ సభ్యుడు బుడతా మధుసూదన్ యాదవ్.. మరో ముగ్గురు సర్పంచ్ లు.. ముగ్గురు మాజీ సర్పంచ్ లు.. పలువురు ఉప సర్పంచ్ లు.. వార్డు సభ్యులు.. ఆయా గ్రామాల్లో వివిధ స్థాయిల్లో ఉన్న నేతలంతా మూకుమ్మడిగా తరలివచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో వారంతా టీడీపీ సభ్యత్వాన్ని తీసుకోవటం గమనార్హం.

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తామీ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా వారు ప్రకటించారు. అధికార పార్టీకి చెందిన పలువురు బీసీ నాయకులు టీడీపీలో చేరే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇది ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు జిల్లాస్థాయి నేతలు హాజరయ్యారు. ఇదే తీరులో మరిన్ని జిల్లాల్లో చోటు చేసుకుంటే మాత్రం అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందన్న మాట వినిపిస్తోంది.