జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. రోడ్డు మార్గంలో ప్రత్యేక కాన్వాయ్ ద్వారా హైదరాబాద్ నుంచి విజయవాడ కు బయలు దేరారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన దరిమిలా విజయవాడకు తరలిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడలోని ఏసీబీ కోర్టులో చంద్రబాబును ప్రవేశ పెట్టేందుకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఈ సమయంలోనే చంద్రబాబును పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ విజయవాడకు బయలు దేరుతున్నట్టు ప్రకటనలు వచ్చాయి. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చేందుకు రెడీ అయ్యారు. అయితే, పవన్ కళ్యాణ్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరడానికి సిద్ధమైన ప్రత్యేక విమానాన్ని టేకాఫ్ కాకుండా కృష్ణా జిల్లా పోలీసులు అడ్డుకున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రయాణించేందుకు రెడీ అయిన విమానాన్ని గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ కాకుండా చూడాలంటూ.. విమానాశ్రయ అధికారులకు కృష్ణా జిల్లా ఎస్పీ లేఖ రాశారు. దీంతో విమానాశ్రయ అధికారులు ల్యాండింగ్ పర్మిషన్ లేదంటూ.. వర్తమానం పంపించారు. దీంతో జనసేన అధినేత ప్రయాణించాల్సిన ప్రత్యేక విమానం బేగంపేటలోనే నిలిచిపోయింది.
ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్.. రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి ప్రత్యేక కాన్వాయ్‌తో విజయవాడకు బయలు దేరారు. అయితే.. రోడ్డు మార్గంలోనూ ఆయనను ఏపీ సరిహద్దు వద్ద అడ్డుకునేం దుకు వందల మంది పోలీసులు మోహరించడం గమనార్హం. ఈ నేపథ్యంలో పంతంగి టోల్ ప్లాజా వద్ద ఎటు చూసినా పోలీసులే కనిపిస్తుండడం గమనార్హం.