అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత ఆయన.. దివంగత ఎన్టీఆర్, ఆ తర్వాత చంద్రబాబు, తాజాగా కేసీఆర్ ప్రభుత్వంలోనూ మంత్రిగా పని చేశారు. ఖమ్మం జిల్లాలో ఆయనకు గొప్ప పట్టుంది. తెలంగాణ ఎన్నికలకు ముందు అలాంటి నాయకుడికి కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందనే అభిప్రాయాలున్నాయి. ఆ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు.
పాలేరు టికెట్ దక్కకపోవడంతో అసంత్రుప్తి ఉన్న ఆయన రాజకీయ భవిష్యత్ ఎలాంటి మార్పులు తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది. పాలేరు సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి మరోసారి కేసీఆర్ టికెట్ ఇవ్వడంతో తుమ్మల అసంత్రుప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాననే సంకేతాలు కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆయన ఏ పార్టీలో చేరతారన్నది చర్చనీయాంశంగా మారింది. ఆయన్ని బీజేపీలోకి తెచ్చేందుకు ఈటల రాజేందర్ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
తాజాగా తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తుమ్మలను అవసరం కోసం వాడుకుని బీఆర్ఎస్ పార్టీ వదిలేసిందని ఈటల పేర్కొన్నారు. తుమ్మలను బీజేపీలోకి ఆహ్వానిస్తామని ఈటల తెలిపారు. అందుకు ఇప్పటికే ఈటల ప్రయత్నాలు మొదలెట్టినట్లు తెలిసింది. త్వరలోనే ఆయన తుమ్మలను కలిసి చర్చిస్తారని సమాచారం. కానీ ఈటల మాటను విని తుమ్మల బీజేపీలో చేరతారా? అన్నది ఇక్కడ ప్రశ్న. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్కు ప్రధాన పోటీ కాంగ్రెస్ అనే భావన ఉంది. అందుకే పొంగులేటి శ్రీనివాస్, జూపల్లి క్రిష్ణారావు.. ఈటలతో చర్చించిన తర్వాత కూడా కాంగ్రెస్లోకే వెళ్లిపోయారు. మాజీ మంత్రి చంద్రశేఖర్ను బీజేపీలోనే ఉండాలని ఈటల కోరినా.. ఆయన కూడా కాంగ్రెస్లో చేరిపోయారు. మరి ఇప్పుడు ఈటల మాటలను విని తుమ్మల బీజేపీలోకి వస్తారేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates