మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారంలో రామోజీరావుపై వైసీపీ ప్రభుత్వం కక్షగట్టిందని టిడిపి నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే #TeluguPeopleWithRamojiRao ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలోనే రామోజీరావుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మద్దతు ప్రకటించారు. ఆ హ్యాష్ ట్యాగ్ ను చంద్రబాబు, లోకేష్ ట్రెండ్ చేశారు. ఈ సందర్భంగా జగన్ పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మీడియా వ్యవస్థను నాశనం చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంస్థలను నిర్వీర్యం చేసే ధోరణిని కొనసాగిస్తూ ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాను జగన్ కూల్చేస్తున్నారని ఆరోపించారు. జగన్, వైసీపీ మోసాలను, నీచమైన పనులను బయటపెట్టే ఈనాడు లాంటి మీడియా సంస్థలను వేధించి బెదిరింపులకు పాల్పడుతున్నాడని, జగన్ నియంతలా వ్యవహరిస్తున్నాడని అన్నారు. 60 ఏళ్లుగా తెలుగు ప్రజలకు సేవ చేస్తున్న మార్గదర్శి ఖ్యాతిని దెబ్బతీసేలా జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జర్నలిజం, సాహిత్యం, విద్యా రంగాలలో రామోజీ సేవలకు పద్మ విభూషణ్ పురస్కారం లభించిందని, ఉన్నత విలువలు కలిగిన రామోజీపై వైసీపీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నానని చంద్రబాబు అన్నారు.
ఇక, రామోజీరావు పై జగన్ పగబట్టారని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకుల అవినీతిని, అసమర్ధ పాలనను ప్రజల దృష్టికి తీసుకువస్తున్న మీడియా సంస్థలపై పగబట్టడం ప్రజాస్వామ్యానికి ముప్పని లోకేష్ అభిప్రాయపడ్డారు. జగన్ మార్గదర్శి సంస్థలపై కక్ష తీర్చుకుంటున్నారని, జగన్ శాడిజాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. తన చేతిలోని ప్రభుత్వ సంస్థలను ప్రత్యర్థులపై పగ తీర్చుకునేందుకు జగన్ వాడుకుంటున్నారని, ఆ సైకో చేష్టలు చూసి ప్రజలకు అసహ్యం కలుగుతుందని లోకేష్ అన్నారు. ప్రజలను చైతన్య పరుస్తున్న మీడియా సంస్థలను, వాటి అధినేతలను వేధించవద్దని హితవు పలికారు. రామోజీరావుకి టీడీపీ అండగా ఉంటుందని, తెలుగు పీపుల్ విత్ రామాజీరావు హ్యాష్ ట్యాగ్ ను లోకేష్ ట్వీట్ చేశారు.