సబితలో టెన్షన్ పెరిగిపోతోందా ?

మంత్రి సబితా ఇంద్రారెడ్డిలో టెన్షన్ పెరిగిపోతోంది. దీనికి కారణం ఏమిటంటే చిరకాల ప్రత్యర్ధి, ప్రస్తుతం పార్టీలోనే ఉన్న తీగల కృష్ణారెడ్డి నుండి టికెట్ విషయంలో తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతుండటమే. నిజానికి సబిత-తీగల చాలాకాలంగా ప్రత్యర్ధులు. సబిత కాంగ్రెస్ లో ఉండేవారు, తీగల తెలుగుదేశంపార్టీలో ఉండేవారు. అయితే మారిన రాజకీయ పరిణామాల్లో తీగల టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిపోయారు. పోయిన ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్ధిగా తీగల పోటీచేస్తే, కాంగ్రెస్ అభ్యర్ధిగా సబిత పోటీచేశారు.

హోరాహోరీగా జరిగిన పోరులో సబిత గెలిచారు. ఇక్కడవరకు బాగానే ఉంది. అయితే ఆ తర్వాత పరిణామాల్లో సబిత బీఆర్ఎస్ లో చేరారు. చేరటమే కాకుండా ఏకంగా మంత్రి కూడా అయిపోయారు. అప్పటినుండి తీగలకు ఇబ్బందులు మొదలయ్యాయి. సరే ఏదో విధంగా నాలుగున్నరేళ్ళు నెట్టుకొచ్చేశారు. అయితే రాబోయే ఎన్నికల్లో టికెట్ కేటాయింపు విషయంలో కేసీయార్ కు సమస్యలు మొదలయ్యాయి. ఇద్దరూ టికెట్ తమకే దక్కాలంటే కాదు తమకే అంటు పట్టుదలగా ఉన్నారు.

దాంతో టికెట్ ఎవరికి ఇవ్వాలో కేసీయార్ కు అర్ధంకావటంలేదు. అయితే సడెన్ గా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో తీగల భేటీ అయ్యారనే విషయం బయటకుపొక్కింది. అయితే ఆ తర్వాత అది నిజమే అని నిర్ధారణ కూడా అయ్యింది. తీగలను వదులుకునే ఉద్దేశ్యంలో కేసీయార్ లేరు. ఎందుకంటే తీగలకు బలమైన మద్దతుదారులున్నారు. క్షేత్రస్ధాయిలో బలమైనపట్టుంది.

తీగల సహకారం లేకపోతే సబిత గెలుపు కష్టమే. అందుకనే ఇద్దరు కూర్చుని మాట్లాడుకోమని చెప్పినట్లున్నారు. కారణం ఏదైనా ఇద్దరి భేటీ జరిగింది. భేటీలో ఏమి మాట్లాడుకున్నారో బయటకు తెలీటంలేదు. అయితే భేటీ జరిగిన తర్వాత కూడా ఇద్దరు ఎడమొహం పెడమొహంలాగే వ్యవహరిస్తున్నారు. దాంతో తీగల ఎక్కువరోజులు బీఆర్ఎస్ లో ఉండరనే ప్రచారం పెరిగిపోతోంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున తీగల పోటీచేస్తే తన పరిస్దితి ఏమిటనే విషయంలో సబిత టెన్షన్ పడుతున్నారట. అసలే కేసీయార్ పాలనపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందనే ప్రచారం తెలిసిందే. అందుకనే గెలుపుపై సబితలో టెన్షన్ పెరిగిపోతోందట.