జగన్ మోకాళ్లపై కూర్చోబెట్టలేదన్న మంత్రి

వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగన్ పెద్ద పీట వేశారని ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. నామినేటెడ్ పదవులలో 50 శాతానికి పైగా బీసీలకు, ఎస్టీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు జగన్ కట్టబెట్టారని వైసిపి నేతలు డబ్బా కొడుతూ ఉంటారు. అయితే, జగన్ పాలనలో దళితులను, బీసీలను, మైనారిటీలను బానిసలుగా చూస్తున్నారని, వారితో జగన్ ప్రవర్తించే తీరు అందుకు నిదర్శనం అని పలుమార్లు ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పించారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా అమలాపురంలో పర్యటించిన జగన్ మంత్రి పినిపే విశ్వరూప్ ను మోకాళ్లపై కూర్చోబెట్టారని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. జగన్ పక్కన చిన్నపిల్లాడిలాగా విశ్వరూప్ మోకాళ్లపై కూర్చున్న ఫోటో ఒకటి వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలోనే దళిత మంత్రికి సీఎం సాక్షిగా అవమానం జరిగిందంటూ జగన్ పై ట్రోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై విశ్వరూప్ స్పందించారు. ఆ కార్యక్రమంలో మోకాళ్ళపై కూర్చోబెట్టారు అని వస్తున్న వార్తలు అవాస్తవమని, తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు తారె స్టేజ్ ఎక్కలేదని, ఆ తర్వాత సీఎం పిలవడంతో స్టేజిపైకి వెళ్లానని చెప్పారు.

అయితే, వెనక నిలబడ్డ మహిళలకు తాను అడ్డంగా ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే మోకాళ్ళపై కూర్చున్నానని క్లారిటీనిచ్చే ప్రయత్నం చేశారు. దళిత మంత్రిని అవమానించారు అంటూ ప్రచారం చేయడం తగదని, తనకు తానుగా అలా కూర్చున్నానని చెప్పారు. ఇక, 30 ఏళ్ల రాజకీయ జీవితంలో తనని ఎవరు కింద కూర్చోబెట్టలేదని అన్నారు. సంతోషంగా ఉంటేనే రాజకీయాల్లో కొనసాగుతానని, తన ఆత్మ గౌరవానికి భంగం కలిగితే తప్పుకుంటానని చెప్పారు. ఇక, జగన్ పర్యటన సందర్భంగా తాను ఫ్లెక్సీలు డిజైన్ చేయించానని, తమ కుటుంబంలో గొడవలున్నాయని ఫ్లెక్సీలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కలిసే ఉన్నామని చెప్పారు.