ఈ సారి కాంగ్రెస్ అభ్య‌ర్థుల ఎంపిక ఇలా!

తెలంగాణ ఎన్నిక‌ల్లో కేసీఆర్‌కు చెక్ పెట్టి అధికారంలోకి రావాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న కాంగ్రెస్‌.. అందుకు త‌గ్గ క‌స‌ర‌త్తుల‌తో ముందుకు సాగుతోంది. ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆద‌ర‌ణ‌ను ఓట్లుగా మ‌లుచుకునేందుకు స‌రైన అభ్య‌ర్థుల‌ను బ‌రిలో దింపాల‌ని చూస్తోంది. అందుకే ఈ సారి అభ్య‌ర్థుల ఎంపిక‌కు గ‌తంలో కంటే భిన్న‌మైన ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది.

ఎన్నిక‌ల్లో నిల‌బెట్టే అభ్య‌ర్థుల ఎంపిక‌, టికెట్ల కేటాయింపుపై కాంగ్రెస్ కొన్నేళ్లుగా ఓ ప‌ద్ధ‌తి పాటిస్తోంది. టికెట్ ఆశిస్తున్న నాయ‌కుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తుంది.  వీటిలో నుంచి కొంత‌మంది పేర్ల‌ను టీపీసీసీ షార్ట్‌లిస్ట్ చేసి అధిష్ఠానానికి పంపిస్తుంది. అక్క‌డ స్క్రీనింగ్ క‌మిటీ మ‌రోసారి షార్ట్‌లిస్ట్ చేసి.. చివ‌ర‌కు ఏఐసీసీ ఎన్నిక‌ల క‌మిటీ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తుంది. ఇదే ఆన‌వాయితీగా వ‌స్తుంది. 2018 ఎన్నిక‌ల్లో అయితే ఏఐసీసీ నియ‌మించిన స్క్రీనింగ్ క‌మిటీ హైద‌రాబాద్‌కు వ‌చ్చి ఇంట‌ర్వ్యూలు చేసి మ‌రీ అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసిన‌ట్లు తెలిసింది.

కానీ ఈ సారి మాత్రం అభ్య‌ర్థుల ఎంపిక‌కు కాంగ్రెస్ మ‌రో మార్గంలో వెళ్ల‌నుంది. ఈ సారి స్క్రీనింగ్ క‌మిటీ నేరుగా క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు తెలిసింది. ఆయా జిల్లాల‌కు వెళ్లి అక్క‌డి నియోజ‌క‌వ‌ర్గాల్లో టికెట్ ఆశిస్తున్న నాయ‌కుల‌తో పాటు ఇత‌ర కీల‌క నాయ‌కుల‌తోనూ మాట్లాడి, అభిప్రాయాలు తీసుకోనుంది. ఆ త‌ర్వాత అభ్య‌ర్థుల జాబితా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఈ స్క్రీనింగ్ క‌మిటీలో పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌, సీఎల్పీ నేత భట్టి, ఎంపీ ఉత్త‌మ్ కూడా ఉన్నారు. గ‌తంలో పార్టీలో విభేదాల కార‌ణంగా అభ్య‌ర్థుల విజ‌యం కోసం ఇత‌ర నేత‌లు ప‌ని చేయ‌లేద‌ని స‌మాచారం. అందుకే ఈ సారి అలాంటి విభేదాలు ఉండ‌కుండా నేరుగా జిల్లాల‌కే వెళ్లి ప‌రిస్థితిని తెలుసుకోనున్న‌ట్లు స‌మాచారం.