నినాదాలు కావ‌లెను.. ఆఫ‌ర్లు మామూలుగా లేవు బ్రో!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఏడాది చివ‌రిలో తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అదేవిధంగా వ‌చ్చే ఏడాది ఏపీలోనూ లేదా.. ముందస్తు అంటే.. ఈ ఏడాదే ఎన్నిక‌ల గంట మోగ‌నుంది. అయితే.. ఏ పార్టీ విజ‌యం ద‌క్కించుకోవాల‌న్నా.. ఏ పార్టీ అధికార పీఠం ఎక్కాల‌న్నా.. ఖ‌చ్చితంగా కావాల్సింది..ప్ర‌జ‌ల ఆశీర్వాద‌మే. మ‌రి ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకునేందు కు.. వారి చెంత‌కు చేరుకునేందుకు.. పార్టీల‌కు కావాల్సింది నినాదాలు.

వ‌స్తున్నా మీకోసం.. అంటూ.. గ‌తంలో చంద్ర‌బాబు పిలుపునిచ్చినా.. రావాలి జ‌గ‌న్‌-కావాలి జ‌గ‌న్ అని వైసీ పీ పిలుపునిచ్చినా.. అంతిమంగా.. ప్ర‌జ‌లను త‌మ‌వైపు తిప్పుకొని ఓట్లు దూసుకునే ప్ర‌ణాళికే ఉంటుంది. ఇక‌, తెలంగాణ‌లోనూ ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి నినాదాల పిచ్చి లేక‌పోయినా.. సెంటిమెంటుతో కొట్టుకొచ్చా రు. మ‌న నీళ్లు-మ‌న నేల‌- మ‌న పాల‌న అంటూ.. బీఆర్ ఎస్‌, ఇచ్చింది-తెచ్చిందీ మేమే అంటూ.. కాంగ్రెస్ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కువెళ్లాయి.

అయితే.. ఇప్పుడు అటు ఏపీలో చూసినా.. ఇటు తెలంగాణ‌లో చూసినా.. ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకునేందు కు.. పార్టీల‌కు నినాదాలు క‌రువ‌య్యాయి. పాత‌వి ప్ర‌యోగిద్దామంటే.. ప్ర‌జ‌లు ఇప్ప‌టికే వినీ వినీ బోరు కొట్టి ఉన్నార‌నిపార్టీలు అంచ‌నా వేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే తాజాగా నినాదాల కోసం.. వెంప‌ర్లాడుతున్నా యి. ఇటీవ‌ల కాలంలో చంద్ర‌బాబు త‌న ఐటీడీపీ బృందానికి ఇదే టాస్క్ అప్ప‌గించారు. దీంతో యువ‌గ‌ళం.. వంటి కార్య‌క్ర‌మం అయితే ఏర్పాటైంది కానీ.. నినాదాలు మాత్రం రాలేదు.

ఇక‌, వైసీపీ కూడా.. ఐప్యాక్ ద్వారా కొన్ని నినాదాలు రెడీ చేసింది. అవే.. జ‌గ‌న‌న్నే మా న‌మ్మ‌కం.. మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న్‌, వైనాట్ 175 వంటివి ఇప్ప‌టికే ప్ర‌యోగించేశారు. కానీ, రాసిలో వాసిలో వాటిక‌న్నా మించిన నినాదాల కోసం .. ఏపీలో ఈ రెండు పార్టీలూ.. ఎదురు చూస్తున్నాయి. ఉన్న‌త విద్య చ‌దివిన వారి మెద‌ళ్ల‌కు ప‌దును పెట్టి.. నినాదాలు ఇస్తే.. ల‌క్ష‌లు కుమ్మ‌రించేందుకు పార్టీలు రెడీగా ఉన్నాయ‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికైతే.. త‌మ అనుచ‌రుల‌కు ఫోన్లు చేస్తున్న పార్టీల నేత‌లు.. నినాదాలు కావాల‌ని చెబుతున్నారు.

ఇక‌, తెలంగాణ‌లోనూ అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో కొత్త నినాదాల కోసం నాయ‌కులు ఒత్తిడి పెంచుతున్నారు. త‌ద్వారా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లాల‌నేది పార్టీల వ్యూహంగా ఉంది. సో.. ఇప్పుడు నాయ‌కుల ధ్యాసంగా నినాదాల‌పైనే ఉంది. ఇక్క‌డ పార్టీల‌కు అతీతంగా ఎవ‌రు నినాదాలు ఇచ్చినా.. తీసుకుని ప‌రిహారం ఇచ్చేందుకు కూడా రెడీగానే ఉన్నారు. సో.. మ‌రి ఎవ‌రు ముందుకు వ‌స్తారో ఎలాంటి నినాదాలు ఇస్తారో చూడాలి.