జనసేనాని పవన్ కళ్యాణ్….ఏపీలోని వాలంటీర్ల వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా పవన్ వ్యాఖ్యలపై హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. పవన్ కల్యాణ్ తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమెన్ ట్రాఫికింగ్ పై తన దగ్గరున్న వివరాలను పవన్ బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. కరోనాకాలంలో వాలంటీర్లు వెలకట్టలేని సేవలు చేశారని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేసిన గుర్తు చేశారు.
ఇక, ఉభయగోదావరి జిల్లాలకే పవన్ ను చంద్రబాబు పరిమితం చేశారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ విమర్శించారు. పవన్ ను చంద్రబాబు ట్రాప్ చేశారని, అందుకే వాలంటీర్లపై ఆ విధంగా వ్యాఖ్యలు చేశారని అన్నారు. వాలంటీర్లపై పవన్ వి నీచమైన వ్యాఖ్యలని మండిపడ్డారు. ఇక, వాలంటీర్లపై పవన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. బుద్ధున్నవారు ఇలా మాట్లాడరని, పనికిమాలిన వ్యక్తులే ఇలాంటి బుర్ర లేని మాటలు మాట్లాడతారని అన్నారు. పిచ్చి మాటలు మానుకోవాలని పవన్ కు హితవు పలికారు. కేకలు వేయడం, తొడగొట్టడం సినిమాల్లో చెల్లుతాయని రాజకీయాల్లో చెల్లవని అన్నారు.
ఇక, రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది వాలంటీర్లను కించపరిచేలా మాట్లాడడం సరికాదని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. కొందరు వాలంటీర్లు తప్పు చేస్తే అందర్నీ విమర్శించడం సరికాదని చెప్పారు. జనసైనికులు ఎక్కడైనా తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ తప్పు చేసినట్లా అని ప్రశ్నించారు. జనసైనికులు గంజాయి తాగుతూ దొరకలేదా, గొడవలు చేయలేదా అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో వాలంటర్ల సత్తా ఏంటో చూపిస్తారని, పవన్ కు రాష్ట్రంలోని మహిళలు బుద్ధి చెబుతారని అన్నారు.
మరోవైపు, పవన్ కళ్యాణ్ పై విజయవాడ పోలీస్ కమిషనర్ కు వైసీపీ లీగల్ సెల్ ఫిర్యాదు చేసింది. వాలంటీర్లతో కలిసి వైసీపీ లీగల్ సెల్ కు చెందిన పలువురు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. పవన్ కామెంట్లు వాలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉన్నాయని, ఆ మాటలు సభ్య సమాజంలో అలజడి రేపేలా ఉన్నాయని న్యాయవాదులు వాపోయారు. వాలంటీర్లకు పవన్ తక్షణమే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates