ఉరుము లేని పిడుగులా.. ‘జ‌గ‌న‌న్న సుర‌క్ష‌’ అస‌లేంటిది?!

jagan

ఎలాంటి హ‌డావుడీ లేకుండా.. ఎక్క‌డా ప్ర‌చారం కూడా చేసుకోకుండానే తాజాగా ఏపీ సీఎం జ‌గ‌న్.. జ‌గ‌న‌న్న సుర‌క్ష‌ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించారు. అదికూడా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల స‌మ‌క్షంలోనే ఆయ‌న దీనిని ప్ర‌క‌టించి.. వారిని కూడా ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. దీంతో ఒక్క‌సారిగా జ‌గ‌న‌న్న సుర‌క్ష‌ అంటే ఏంట‌నే చ‌ర్చ ప్రారంభ‌మైంది. మ‌రి ఇదేంటో తెలుసుకుందాం.

రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వం అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తోంది. ల‌బ్ధిదారుల‌కు నిధులు అందిస్తోంది. అయితే.. ఏవైనా కారణాల వల్ల ఎవరైనా అర్హులకు సంక్షేమ పథకాలు అందనట్లయితే వారికి పథకాలు అందించేలా, సేవలకు సంబంధించి అవసరమైన పత్రాలు వెంటనే మంజూరుచేసే కార్య‌క్ర‌మ‌మే జ‌గ‌న‌న్న సుర‌క్ష‌. పేరు డిఫ‌రెంట్‌గా ఉన్న‌ప్ప‌టికీ.. ఈ ప‌థ‌కం ఉద్దేశం మాత్రం ఇదే.

ప్రజల వద్దకు నేరుగా వలంటీర్లు, సచివాలయ గృహసారథులను పంపించి సమస్యలు, ఇబ్బందులు తెలుసుకోవడంతో పాటు వారికి పథకాలు లేదా పత్రాల మంజురుకు సంబంధించి సమస్యలుంటే తెలుసుకుని వెంటనే పరిష్కరించే దిశగా జగనన్న సురక్ష కార్యక్రమానికి నాంది పలికిన‌ట్టు సీఎం జ‌గ‌న్ చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఈ నెల 23న ప్రారంభించనున్నారు.

ఈ నెల 24నుంచి వలంటీర్లు, గృహసారథులులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికీ వెళ్లి జగనన్న సురక్ష కార్యక్రమం ఆవశ్యకతను వివరిస్తారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటారు. పథకాలు, సేవలకు సంబంధించి ప్రజలు సమస్యలు తెలిపిన పక్షంలో వివరాలను తెలుసుకుని, సేవలకు సంబంధించి అవసరమైన ఆదాయ, కుల, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, మ్యారేజ్‌ సర్టిఫికెట్‌, మ్యుటేషన్‌లు, ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌, ఆధార్‌లో మొబైల్‌ నంబర్‌ అప్‌డేషన్‌, క్రాప్‌ కల్టివేటర్‌ రైట్స్‌ కార్డ్‌లు వంటివి మంజూరు గురించి వివరిస్తారు.

ఎవరైనా పథకాలు, సేవలకు సంబంధించిన సమస్యలు చెప్తే వాటికి సంబంధించి అవసరమైన దరఖాస్తులను తీసుకుని సచివాలయంలో అందజేస్తారు. ప్రతి సచివాలయం పరిధిలో ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం నిర్వహిస్తారు. వారంలో మూడు సచివాలయాల చొప్పున నెలరోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. మున్సిపాలిటీ, మండలంలోని అన్ని సచివాలయాల్లో ఈ క్యాంపు నిర్వహించే దిశగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

జగనన్న సురక్ష ద్వారా అర్హులుగా గుర్తించిన వారికి ఆగస్టు 1న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి లబ్ధి చేకూరుస్తారు. అంటే.. ఆయా ప‌థ‌కాల్లో నిధులు అందిస్తార‌న్న‌మాట‌. ఏదేమైనా ఎన్నిక‌ల‌కు ముందు.. ఏదో ఒక విధంగా ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డ‌మే ఈ ప‌థ‌కం ఉద్దేశ‌మ‌ని అంటున్నారు ప్ర‌తిప‌క్ష నాయ‌కులు.