తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తరఫున తొలి ఎంపీ అభ్యర్థిని కేటీఆర్ ప్రకటించారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్ పేరు ప్రకటించారు. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆశ్వీరాద సభలో పాల్గొన్న కేటీఆర్ సభా వేదిక నుంచే కీలక ప్రకటన చేశారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్ పేరు ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ నుంచి ఎంపీ అభ్యర్థులలో తొలి టికెట్ ప్రకటించినట్లయింది. కాగా కేటీఆర్ ప్రకటనతో కరీంనగర్ పార్లమెంట్ స్థానంపై ఉన్న సస్పెన్స్‌కు తెర వీడింది.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్‌ను గెలిపించి.. బండి సంజయ్‌ను ఇంటికి పంపాలని సూచించారు. కానీ పరిస్థితులను చూస్తుంటే కేటీఆర్ చెప్పింది అంత సులభం కాదనే అంటున్నారు కరీంనగర్ ప్రజలు. బోయినపల్లి వినోద్ కుమార్ 2009 ఎన్నికలప్పటి నుంచి కరీంనగర్ పార్లమెంటు స్థానంలో పోటీ చేస్తున్నారు. ఇప్పటివరకు మూడుసార్లు పోటీ చేయగా 2014లో ఒక్కసారి మాత్రమే ఆయన గెలిచారు.
బోయినపల్లి వినోద్ కుమార్ కరీంనగర్‌కు స్థానికులు కారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వినోద్ కుమార్ కేసీఆర్ కుటుంబానికి బంధువు అవుతారు. వివాదరహితుడు, ప్రజాసమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి, మేధావి అనే పేరు ఉన్నప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండేది తక్కువే. ఎక్కువగా పార్టీ పనుల్లో, బ్యాక్‌గ్రౌండ్ వర్క్‌లో ఉంటారాయన. 2009లో తొలిసారి కరీంనగర్‌లో పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2014కి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో ఆ ఊపులో 2 లక్షల భారీ మెజారిటీతో పొన్నంపై గెలిచారు. కానీ, 2019లో బండి సంజయ్ చేతిలో 90 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా అయిన కరీంనగర్‌లో స్థానికుడు కాకపోవడం అనేది కొంత మైనస్. ఈ నియోజకవర్గం పరిధిలో కరీంనగర్ అసెంబ్లీ, చొప్పదండి ఎస్సీ, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూర్ ఎస్సీ, హుజూరాబాద్, హుస్నా బాద్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. పద్మశాలీ, మున్నూరు కాపులు, వెలమ, రెడ్లు వంటి కులాలన్నీ ఉన్న లోక్ సభ నియోజకవర్గం కరీంనగర్. ఇలాంటి చోట నుంచి గెలిచిన మున్నూరు కాపు కులానికి చెందిన బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడంతో ఆ కులంలో బలమైన ముద్ర పడింది. కాబట్టి ఈసారి మున్నూరు కాపుల ఓట్లలో అత్యధికం బీజేపీకే పడతాయి. అలాంటప్పుడు బీఆర్ఎస్ కూడా మున్నూరుకాపు అభ్యర్థిని బరిలో దించితే పోటీ తీవ్రంగా ఉండేది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తప్ప ఎన్నడూ కరీంనగర్‌లో గెలవని వినోద్ కుమార్‌ను బండి సంజయ్‌పై పోటీ పెట్టడం వ్యూహాత్మక తప్పిదమేనంటున్నారు విశ్లేషకులు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుఫున కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసిన బోయినపల్లి వినోద్ కుమార్ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై ఓటమి పాలయ్యారు. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనకు కేబినెట్ హోదాతో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించింది. కానీ, లోక్ సభ నియోజకవర్గం పరిధిలో మాత్రం ఆయన పట్టు పెంచుకోలేకపోయారు.
కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లన్నీ బీఆర్ఎస్ గెలిచినా లోక్ సభ సీటు మాత్రం బీజేపీ గెలిచింది గతసారి. అంటే పెద్దఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగింది. ఈసారి ఈ నియోజకవర్గంలో బీజేపీకి లోక్ సభ అభ్యర్థికి ఓట్లు పడతాయని స్థానికులు చెప్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ తమ తొలి అభ్యర్థిగా వినోద్ కుమార్‌ను ప్రకటించడం రాంగే అంటున్నారు.
అయితే… రాజకీయ మాయావిగా పేరున్న కేసీఆర్ చివరి నిమిషంలో వేరే అభ్యర్థిని బరిలో దించినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు బీఆర్ఎస్ రాజకీయాలు తెలిసినవారు.
This post was last modified on May 7, 2023 6:04 am
పవన్ కళ్యాణ్ ఎంత పవర్ స్టార్ అయినా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి బాధ్యతతో కొన్ని కీలక శాఖలు నిర్వహిస్తూ నిత్యం…
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో జరగడం వల్ల వెంటనే లైవ్ చూసే అవకాశం అభిమానులకు లేకపోయింది. అక్కడ…
ఏపీ సీఎం చంద్రబాబు సాంకేతికతకు పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే రైతులకు సంబంధించిన అనేక విషయాల్లో…
బాలీవుడ్లో చాలామందితో ప్రేమాయణం నడిపిన హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్ సహా ఈ జాబితాలో…
‘పుష్ప-2’ రిలీజ్ తర్వాత ఆ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేయలేని స్థితిలో ఉన్నాడు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ తొక్కిసలాట…