చంద్రబాబు పుట్టిన రోజు వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ నేతల సోషల్ మీడియా అకౌంట్లు అన్నీ అభినందన సందేశాలతో నిండిపోతాయి. వాట్సాప్‌లలో స్టేటస్‌లు, డీపీలలో చంద్రబాబుతో తాము ఉన్న ఫొటోలతో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు టీడీపీ నేతలు ఆనందం షేర్ చేసుకుంటారు. సొంత పార్టీ వారే కాదు చంద్రబాబు స్థాయి రీత్యా, ఆయనకు ఉన్న పరిచయాల రీత్యా దేశంలోని ఇతర పార్టీల నేతలు, ప్రధాని, ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తుంటారు. ఏపీలోని చంద్రబాబును నిత్యం ఢీకొట్టే వైసీపీ అధినేత జగన్ కూడా కర్టెసీ కోసం అభినందనలు చెప్తారు.
అయితే, వైసీపీలోని ఇతర నేతలు చంద్రబాబుతో తమకు పూర్వ పరిచయం, మంచి సంబంధాలు ఉన్నా కూడా తమ సొంత పార్టీ నుంచి తమకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు గాను సాధారణంగా ఎవరూ అభినందనలు చెప్పరు. కానీ… ఈ ఏడాది చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా వైసీపీలో ఒకప్పటి నంబర్ 2 విజయసాయిరెడ్డి మాత్రం ఉదయాన్నే ట్విటర్ వేదికగా అభినందనలు చెప్పారు.
‘‘టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడంతో వైసీపీ శ్రేణులు, నాయకులు ఆశ్చర్యపోతున్నారు. జగన్ ఇంకా చంద్రబాబుకు అభినందనలు చెప్పకముందే విజయసాయిరెడ్డి చెప్పడంతో సాయిరెడ్డిలో మార్పు గురించి చర్చ జరుగుతోంది.
గతంలోనూ చంద్రబాబు జన్మదినం సందర్భంగా సాయిరెడ్డి ట్వీట్లు చేసినా అప్పట్లో వెటకారంతో, ఏడిపించేలా శుభాకాంక్షలు చెప్పేవారు. కానీ, ఈసారి సాయిరెడ్డి చేసిన ట్వీట్లో దగ్గరితనం కనిపించింది. ఇంతకుముందు ఏడాది ఆయన ‘‘పక్క రాస్ట్రంలో పుట్టిన రోజు జరుపుకొంటున్న 420కి శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు అదే సాయిరెడ్డి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్పారు.
గత ఏడాదికాలంగా సాయిరెడ్డికి వైసీపీలో ప్రాధాన్యం తగ్గింది. అంతా సజ్జల చేతికి వెళ్లింది. సాయిరెడ్డి చేతిలోని సోషల్ మీడియా బాధ్యతలు కూడా సజ్జల కుమారుడికి ఇచ్చారు. అవినాశ్ రెడ్డి వ్యవహారంలో దిల్లీలోని పెద్దలతో డీలింగ్ బాధ్యతలలోనూ సాయిరెడ్డి ప్రమేయం ఏమీలేదు.. అంతేకాదు.. అవినాశ్ రెడ్డిని మళ్లీ సీబీఐ విచారిస్తున్న సమయంలో పార్టీలోని అత్యంత ముఖ్యులతో జగన్ సమావేశమైనప్పుడు కూడా అందులో సాయిరెడ్డి లేరు.
అదేసమయంలో సాయిరెడ్డి కొద్దినెలలుగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన బావమరిది బాలకృష్ణతో సానుకూలంగా, సఖ్యంగా ఉంటున్నారు. నందమూరి తారకరత్న మృతి నుంచి సంబంధాలు మరింత బలపడ్డాయి. తారకరత్నకు, విజయసాయిరెడ్డికి ఉన్న దగ్గరి బంధుత్వం.. తారకరత్న హాస్పిటల్లో ఉన్నప్పుడు బాలకృష్ణ చూపించిన శ్రద్ధ వంటివన్నీ ఇద్దరినీ దగ్గర చేశాయి.
వైసీపీలో తనను పక్కన పెడుతున్నందునే సాయిరెడ్డి చంద్రబాబుకు దగ్గరవుతున్నారన్న ప్రచారం ఒకటి వినిపిస్తుండగా.. చంద్రబాబుకు దగ్గరవుతున్నందునే వైసీపీలో పక్కన పెట్టారన్న వాదన ఇంకోటి వినిపిస్తోంది.
ఇందులో ఏది నిజమైనా కూడా సాయిరెడ్డి టీడీపీకి, చంద్రబాబు కుటుంబానికి సన్నిహితుడు అవుతున్నారన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇది ఎలాంటి మార్పునకు దారితీస్తుందో చూడాలి
This post was last modified on April 20, 2023 2:04 pm
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…