ఏపీకి పూర్వ‌వైభ‌వం తెస్తా: చంద్ర‌బాబు

వ‌చ్చే ఏడాదిలో టీడీపీ ఏపీలో పాల‌న ప్రారంభిస్తుంద‌ని.. టీడీపీ అధికార‌మ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. తెలుగు వారు ఎక్కడున్నా నెంబర్‌.1గా ఉండాలన్నదే తన సంకల్పమని అన్నారు. రాష్ట్రంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని, ఏపీని పునర్‌నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఏడాది టీడీపీ వస్తుందని.. రాష్ట్రానికి పూర్వవైభవం తెస్తామని ఆయన స్పష్టం చేశారు. సమాజమే దేవాలయం అన్న ఎన్టీఆర్ సూత్రాన్ని అమలు చేస్తామని, పేదలను ఆర్థికంగా పైకి తెస్తామన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తామన్నారు.

రండి సేవ చేయండి
జీవితంలో స్థిర పడ్డవారు స్వగ్రామాలను అభివృద్ధి చేయాలని.. ప్రతి గ్రామంలో 5 కుటుంబాలకు చేయూతనివ్వాలని చంద్ర‌బాబు సూచించారు. బాగా పనిచేసిన వారిని టీడీపీ తరపున సన్మానిస్తామన్నారు. ఒక కాన్సెప్ట్ రూపొందించి రాష్ట్రం మొత్తం అమలయ్యేలా చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఏం చేసినా చరిత్రేనని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. కృషి, పట్టుదలతో మహోన్నత వ్యక్తిగా ఆదర్శంగా నిలిచారని ఎన్టీఆర్‌ను కొనియాడారు.

తన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలను ఎన్టీఆర్ తనతో చెప్పేవారని విశ్రాంతి తీసుకునే సమయంలో జనం కోసం పనిచేశారన్నారు. తెలుగు జాతి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. సాంకేతికతను ముందుచూపుతో ప్రోత్సహించామన్నారు. హైదరాబాద్‌ నెంబర్‌ వన్‌గా ఉందంటే అది టీడీపీ పాలనకు నిదర్శనమని, ఓఆర్‌ఆర్‌, ఎయిర్‌పోర్ట్, హైటెక్‌సిటీ టీడీపీ పాలనను గుర్తు చేస్తాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టిన 9 నెలల్లో సీఎం అయి చరిత్ర సృష్టించారని, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి ప్రధానిని నిర్ణయించే స్థాయికి ఎదిగారని చంద్రబాబు అన్నారు.

నెల రోజుల్లో 100 స‌మావేశాలు
తెలుగు జాతి ఉన్నంతకాలం ఎన్టీఆర్ స్ఫూర్తి, ఆలోచన, సిద్దాంతాలు ఉంటాయన్నారు. మే 28లోపు 100 సమావేశాలు పెట్టాలని నిర్ణయించామని, అన్ని చోట్లా ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరును లోకేష్ దత్తత తీసుకుని అభివృద్ధి చేశారని చెప్పారు. ఇప్పుడు నిమ్మకూరులో అన్ని వసతులు ఉన్నాయని, తల్లిదండ్రుల తీరు సరిగా ఉంటేనే పిల్లలకు మంచి భవిష్యత్‌ ఉంటుందన్నారు.