ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై ఉద్యోగులు.. మరోసారి కన్నెర్ర చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం.. గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వంతో చర్చిస్తున్న ఉద్యోగులు.. ఇప్పుడు.. తీవ్రస్థాయిలో ఉద్యమానికి రెడీ అయ్యారు. ఇప్పటికే అనేక సార్లు ఉద్యమించి.. ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చినా.. సర్కారు తమ సమస్యలను పరిష్కరించలేదని.. ఉద్యోగులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు ఏకతాటిపైకి వచ్చి.. జేఏసీగా ఏర్పడ్డారు.
ఈ నెల 8వ తేదీ నుంచి 29 వరకు కూడా వివిధ రూపాల్లో సర్కారుపై యుద్ధానికి వారు రెడీ అయ్యారు. అప్పటికీ ప్రభుత్వంలో మార్పు రాకపోతే మూడో దశలో ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కూడీ రెడీ అయ్యారు. తాజాగా విజయవాడలో నిర్వహించిన సమావేశంలో అన్ని జిల్లాల నుంచి హాజరైన ప్రతినిధులు సమస్యలపై చర్చించారు.
జీతాల పెంపు కాదు.. అసలు ఇస్తే చాలనేలా..
ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ. గత నెల 9 నుంచి ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదన్నారు. “జీతాలు పెరిగితే సంతోషపడే పరిస్థితుల నుంచి నేడు ఒకటో తేదీన జీతం పడితే చాలనే పరిస్థితికి వచ్చాం” అని బొప్పరావు వ్యాఖ్యానించారు. అప్పు కూడా పుట్టని పరిస్థితుల్లో లోన్ యాప్‌ల నుంచి డబ్బులు తీసుకుని, సకాలంలో చెల్లించలేక ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి దాపురించిందన్నారు.
గత ప్రభుత్వమే మేలు..
ఉద్యోగుల విషయంలో గత ప్రభుత్వమే మేలని బొప్పరాజు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన 10వ పీఆర్సీ పేస్కేళ్లే ఇంకా అమలులో ఉన్నాయని తెలిపారు. 11వ పీఆర్సీలో సిఫార్సు చేసినవి ఎప్పుడు అమలు చేస్తారని ఆయన వైసీపీ సర్కారును ప్రశ్నించారు. నెలనెలా ఉద్యోగులు, పింఛనర్ల కోసం రూ. 90,000 కోట్ల వరకు వెచ్చిస్తున్నామని చెబుతున్నారని, వాస్తవానికి తమ కోసం వెచ్చిస్తున్నది రూ. 74,000 కోట్లే అని తెలిపారు. విశాఖలో వచ్చే నెలలో సీపీఎస్ రద్దు కోసం ‘ఉప్పెన’ పేరుతో ఏపీసీపీఎస్‌ఈఏ తలపెట్టిన ఉద్యమంలో తాము కూడా పాల్గొంటామని చెప్పారు.
ఉద్యమం సాగేదిలా..
ఈనెల 8నుంచి ఉద్యోగులు వైసీపీ సర్కారుఉద్యమాన్ని మరింత తీవ్ర తరం చేయనున్నారు. 8వ తారీకున నల్ల కండువాలతో కూడళ్లలో పోస్టర్ల విడుదల చేయున్నారు. 10న.. అన్ని జిల్లాల కలెక్టర్లకు మెమోరాండం సమర్పించనున్నారు. 11న సెల్ డౌన్ అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 12న సమస్యలపై కలెక్టరేట్ల వద్ద ధర్నా చేపట్టనున్నట్టు బొప్పరాజు తెలిపారు. 15వ తారీకున మరణించిన ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి పరామర్శించనున్నట్టు చెప్పారు. వారికి రావాల్సిన నిధులపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు.
18వ తేదీన కలెక్టరేట్ల వద్ద సీపీఎస్ ఉద్యోగుల సమస్యలపై ధర్నా చేయనున్నారు. 20న బ్యాంకర్లను కలిసి ఈఎంఐల చెల్లింపులపై ఒత్తిడి చేయొద్దని, జరిమానాలు వసూలు చేయొద్దని విజ్ఞప్తి చేయనున్నారు. 25న కలెక్టరేట్ల వద్ద కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ధర్నా చేయనున్నారు. 27వ తేదీన పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పరామర్శ కార్యక్రమం నిర్వహించనున్నారు. 29న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సమస్యలపై కలెక్టరేట్ల వద్ద ధర్నా చేపట్టనున్నట్టు బొప్పరాజు వెల్లడించారు.