కేవీపీ నోట ఇలాంటి మాటలా?

కేవీపీ రామచంద్రరావు పేరెత్తగానే అందరికీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకొస్తారు. అందరూ వైఎస్‌ ఆత్మగా కేవీపీని చెబుతారు. వైఎస్ లాగే ఆయన కూడా కరడుగట్టిన కాంగ్రెస్ వాది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అంటే ఆయనకు కూడా పడేది కాదు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనం చవిచూసినప్పటికీ కేవీపీ ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు.

అలాంటి నేత.. తాజాగా చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. చంద్రబాబుకు తెలుగుదేశం నేతల తరహాలో ఆయన ఎలివేషన్ ఇవ్వడం విశేషం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మీద అనర్హత వేటు పడ్డ నేపథ్యంలో ఆయన విజయవాడలో తాజాగా మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. చంద్రబాబు మీద ప్రశంసలు కురిపించారు. మీరు ముందు ఉంటే మేం వెనుక నడుస్తాం అని చంద్రబాబును ఉద్దేశించి కేవీపీ వ్యాఖ్యానించడం విశేషం.

రాహుల్ గాంధీ మీద అనర్హత వేటు పడటంతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని.. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు స్పందించాల్సిన బాధ్యత చంద్రబాబు లాంటి నేతల మీద ఉందని కేవీపీ అన్నారు. “మీ శక్తి సామర్థ్యాలు తక్కువేం కాదు. ఎంతో రాజకీయ చతురత ఉంది. దేశ రాజకీయాల్లో కేంద్ర బిందువు కాగల శక్తి ఉంది. ఒకప్పుడు ఎన్డీఏ కన్వీనర్‌గా పని చేశారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పోరాటంలో మీరు ముందు ఉండండి. మేం మీ వెనుక ఉంటాం.

చంద్రబాబు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేసినపుడు రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ వచ్చి ఆయనకు మద్దతు తెలిపారు. ఇప్పుడు రాహుల్ మీద అనర్హత వేటు పడటంపై చంద్రబాబు స్పందించాలి” అని కేవీపీ అన్నారు. ఏపీలో 25 మంది ఎంపీలు, 175 ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా రాహుల్‌కు జరిగిన అన్యాయం మీద స్పందించకపోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. రాజకీయ కారణాలతో పవన్ ప్రశ్నించలేకపోయినా.. తప్పును తప్పు అని చెప్పాలని ఆయనన్నారు. వైఎస్ లాగా జగన్‌కు మీరెందుకు సలహాలివ్వలేదని అడిగితే.. మరో సందర్భంలో అందుకు కారణాలు చెబుతానని కేవీపీ చెప్పారు.