అక్కడి నేతలకు కోపమొస్తే ఇక అంతేనా.. !

ఎమ్మెల్సీ ఎన్నికలు కొత్త కొత్త వాదనలను ఆవిష్కరించాయి. ఎవరు ఎవరితో ఉండబోతున్నారు. ఎవరు ఎవరినీ కలుపుకోబోతున్నారు లాంటి చర్చలు తారా స్థాయికి చేరాయి. అంతకు మించి ఇప్పుడు మరో మాట అందరి నోళ్లలో నానుతోంది. ఆ ఒక జిల్లా నేతలకు కోపమొస్తే ప్రభుత్వాలు దిగిపోవడమేనని చెబుతున్నారు. అదే నెల్లూరు జిల్లా..

రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు. నెల్లూరు జిల్లా మరో ఎత్తు అంటున్నారు. నెల్లూరు నేతలు అలిగి వెళ్లిపోకుండా చూసుకుంటే అధికార పార్టీ మనుగడకు ఢోకా ఉండదంటున్నారు. మేకపాటి, నేదురుమల్లి, ఆనం, ఆదాల కుటుంబాలతో వైరం మంచిది కాదంటున్నారు.

నెదురుమల్లి జనార్థన్ రెడ్డి నెల్లూరు జిల్లా నుంచి సీఎం అయిన నాయకుడు. నెల్లూరుకే చెందిన వెంకయ్య నాయుడు ఏకంగా ఉప రాష్ట్రపతి పదవిని అలంకరించారు. ఈ సంగతులన్నింటినీ కాసేపు పక్కన పెడితే… సింహపురి సింహాలను కదిలిస్తే కొరివితో తలగోక్కున్నట్లేనంటున్నారు.

2000 సంవత్సరం తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీ మీద అలిగి దూరేం జరిగారు.దానితో 2004లో చంద్రబాబుకు ఘోర పరాజయం తప్పలేదని చెబుతారు. అలాగే ఆనం కుటుంబం ఎటు వైపు ఉంటే అధికారం అటు వైపు ఉంటుందని కూడా లెక్కలేస్తున్నారు. ఆనం సోదరులు నెల్లూరులోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనూ కీలక భూమిక పోషించారు. ఆనం కుటుంబం తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉంది. రామనారాయణ రెడ్డి మంత్రిగా ఉంటే, సోదరుడు వివేకానంద రెడ్డి ఎమ్మెల్యేగా సేవలందించేవారు. ఆనం సోదరులు టీడీపీ మీద అలిగి కాంగ్రెస్ కు మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది. 2015 ప్రాంతంలో రామనారాయణ రెడ్డి టీడీపీలో చేరినా తర్వాత అలిగి దూరం జరిగారు. 2018లో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2019లో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారానికి వచ్చింది.

మేకపాటి కుటుంబం కాంగ్రెస్ నే నమ్ముకుని ఉన్నట్లు కనిపించేది. జగన్ వైసీపీ పెట్టిన తర్వాత ఆ పార్టీకి ప్రాణవాయువు అందించినది కూడా మేకపాటి కుటుంబమేనని చెప్పాలి. ఇప్పుడు ఆనం, మేకపాటి కుటుంబాలు వైసీపీకి దూరం జరుగుతున్నాయి. క్రాస్ ఓటింగ్ చేశారన్న అనుమానంతో చంద్రశేఖర్ రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు శేఖరన్నతో పాటు ఆనం కూడా టీడీపీలో చేరే ఛాన్సుంది. మరి నెల్లూరు సెంటిమెంట్ ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకోండి…