ఔను.. ఉద్యోగులు మాకు ఓటేయ‌రు: డిప్యూటీ స్పీక‌ర్

వైసీపీకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఉద్యోగులు వ్య‌తిరేకంగా మార‌డం ఖాయ‌మ‌ని, ఉద్యోగులు ఆశించిన‌వి ఒక్కటి కూడా వైసీపీ ప్ర‌భుత్వం నెర‌వేర్చ‌డం లేద‌ని.. విమ‌ర్శ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీనాయ‌కులు పెద‌వి విప్పి కామెంట్లు చేయ‌లేదు. కానీ, తాజాగా డిప్యూటీ స్పీక‌ర్, విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన కీల‌క నాయ‌కుడు కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి మాత్రం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

“ఔను.. ఉద్యోగులు మాకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో వేటు వేస్తార‌ని ఎలా అనుకుంటాం. వాళ్లు అనుకున్న‌వి మేం చేయ‌లేదు. మేం ఇచ్చిన‌వి తీసుకున్నారుగా! కాబ‌ట్టి వేసేవారు కూడా ఉంటార‌ని అనుకుంటున్నాం. ఒక వేళ వేయ‌కపోయినా.. మాకు న‌ష్టం లేదు. మ‌ళ్లీ మాకు మ‌హిళ‌లు, బీసీలు అండ‌గా ఉంటారు. అధికారంలోకి వ‌స్తాం. ఈ విష‌యంలో క్లారిటీతోనే ఉన్నాం” అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

ప్ర‌స్తుతం ఉత్త‌రాంధ్ర జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఈ ప్ర‌చారంలో వైసీపీ అభ్య‌ర్థి సీతంరాజు సుధాక‌ర్ త‌ర‌పున కోల‌గ‌ట్ల ప్ర‌చారం చేశారు. వైసీపీ ప్ర‌భుత్వం అన్ని వ‌ర్గాల సంక్షేమాన్ని ఆశిస్తోంద‌న్నారు. అయితే.. కొంద‌రు కొండంత కోరుకుంటారని.. కొండంతా వారికే ఇచ్చేస్తే.. ఇత‌రుల‌కు ఏం ఇవ్వాల‌ని ప్ర‌శ్నించారు. “నాకు కూడా ముఖ్య‌మంత్రి అయిపోవాల‌ని ఉంటుంది. ఇది సాధ్య‌మేనా?” అంటూ..ఉద్యోగుల‌పై ప‌రోక్షంగా మండిప‌డ్డారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు పట్ల ప్రజలు ఆకర్షితులుగా ఉన్నారని అన్నారు. ఈ సందర్భంలో పట్టభద్రులు కూడా మద్దతుగా నిలిచి సీతం రాజు సుధాకర్ ను గెలిపించాలని కోల‌గ‌ట్ల‌ కోరారు.