ధనిక రాష్ట్రం కూడా ఇంత అప్పుల్లో కూరుకుపోయిందా ?

రాష్ట్ర విభజన తర్వాత అత్యంత ధనిక రాష్ట్రమైంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కూడా ఎన్నోసార్లు ఘనంగా చాటుకున్నారు. దేశం మొత్తం మీద అత్యంత ధనిక రాష్ట్రం తమదే అని ఎన్నో వేదికలమీద ప్రకటించారు. అలాంటి ధనిక రాష్ట్రం ఇపుడు అప్పులు చేయందే గడిచేట్లుగా కనబడటంలేదు. ఇప్పటికే ఈ ఉపోద్ఘాతమంతా తెలంగాణా గురించే అని తెలిసిపోయుంటుంది. అత్యంత ధనిక రాష్ట్రమని కేసీయార్ చెప్పుకున్న కాలం నుంచి అప్పులు చేయందే ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్ధితికి ఎందుకు దిగజారిపోయిందో అర్థం కావట్లేదు.

ఇప్పటివరకు చేసిన అప్పులు తీర్చటానికి, వాటికి వడ్డీలు కట్టడానికి కూడా ప్రభుత్వం నానా అవస్థలు పడుతోంది. అప్పులు, వడ్డీలు చెల్లించేందుకు మార్చిలో ప్రభుత్వం సుమారు రు. 7 వేల కోట్లు కేటాయించాలని సమాచారం. ఈ మొత్తం చెల్లించకపోతే మళ్ళీ అప్పుకూడా పుట్టదు. అందుకనే ఆర్బీఐ దగ్గర అప్పుకోసం ప్రభుత్వం నానా తిప్పలు పడుతోంది. ఇప్పటికే చాలామంది ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు రెండో వారంలో కానీ ఇవ్వలేకపోతోంది.

అనుకున్నంత స్ధాయిలో రాబడి రాకపోవటం, ఆదాయాలు పెంచుకోలేకపోవటంతో పాటు వివిధ పథకాల్లో వ్యయం బాగా పెరిగిపోవటమే ఆర్ధిక పరిస్ధితి తల్లకిందులైపోవటానికి కారణాలు. ఆర్ధిక పరిస్ధితిపై కేసీయార్ ఏవో మాటలు చెప్పి నెట్టుకొచ్చేస్తున్నారు కానీ పరిస్ధితంతా డొల్లే అని ప్రతిపక్షాల నేతలు ఇప్పటికే అనేకసార్లు విమర్శలు చేశారు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు కూడా నిలిచిపోతున్నాయి.

ఆర్ధిక సంవత్సరం ముగింపు కాబట్టి అన్నీ శాఖలు, పథకాలపైన దెబ్బ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఆశించిన స్ధాయిలో ఆదాయం పెరగకపోవటం తో వేరే దారిలేక ఫిబ్రవరిలో బాండ్లను అమ్మి వెయ్యి కోట్ల రూపాయలను సమకూర్చుకున్నది. మరో వెయ్యి కోట్ల రూపాయల విలువైన బాండ్లను అమ్మేందుకు ఆర్బీఐ అనుమతి కోరింది. ఇదంతా అప్పులకు కట్టాల్సిన వడ్డీల కోసమే అని ఆర్ధికశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా తలకుమించిన పథకాలు ఎత్తుకోవటం వల్లే ఖజనాపై బాగా ఆర్ధికభారం పెరిగిపోతోందని అధికారవర్గాలు చెబుతున్నాయి. మరి ఎన్నికల సంవత్సరం కదా ఇలాంటి సమస్యలు ఇంకా ఎన్ని బయటపడతాయో, వాటినుండి ప్రభుత్వం ఎలా బయటపడుతుందో చూడాల్సిందే.