ఏపీ సీఎం జగన్‌పై మాజీ మంత్రి, కాంగ్రెస్ మాజీ నాయకుడు, ప్రస్తుతం తాను వైసీపీలో ఉన్నానని చెప్పుకొంటున్న డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ చిన్నాన్న.. వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేసిన వారు ఎవరో.. సీఎం జగన్‌కు తెలుసునని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. చంపింది ఎవరో చెప్పి.. జగన్ తన నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ రువ్వారు. అంతేకాదు.. కుటుంబ పెద్దను, తండ్రితర్వాత తండ్రిఅంతటి వాడిని దారుణంగా చంపిన వారుజగన్ చుట్టూనే తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు.
వివేకానందరెడ్డిని ఎవరో చంపారో సీఎం జగన్‌కు తెలుసు అని డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జగన్‌రెడ్డి ఇప్పటికైనా అన్ని విషయాలు చెబితే మంచిపేరు వస్తుందని, వివేకా వెంట ఉంటూనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనను ఓడించేందుకు.. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుట్రలు చేశారని డీఎల్ ఆరోపించారు. ఆ తర్వాత ఎంపీ సీటు కోసం జరిగిన ఘర్షణలో దేవిరెడ్డికి, వివేకానందరెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం.. ఘర్షణ చోటు చేసుకున్నాయని తెలిపారు. ఈ విషయాన్ని అప్రూవర్‌గా మారిన దస్తగిరి కూడా వెల్లడించారని అన్నారు.
ఇంత కీలకమైన విషయంలో సీఎం జగన్ అసలు తనకు ఏమీ తెలియనట్టుగా వ్యవహరించడం.. తన చుట్టూనే హంతకులను తిప్పుకోవడం వంటివి ప్రజల్లో ఎలాంటి సంకేతాలు వెళ్తాయో గుర్తించాలన్నారు. ఇప్పటికైనా జగన్ కూడా అప్రూవర్‌గా మారాలని వ్యాఖ్యానించారు. ఇక, ఏపీలో వైసీపీ పాలన అవినీతి కంపు కొడుతోందని డీఎల్ ఆరోపించారు. వైసీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు అవినీతిలో మునిగిపోయారని, జగన్‌రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని రవీంద్రారెడ్డి అన్నారు. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారని.. అందుకే టీడీపీ సభలు హిట్ అవుతున్నాయని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates