డ్రాగన్ దేశానికి ఆశ చావలేదు. అరుణాచల్ పై పట్టుకు చేయని ప్రయత్నం లేదు. గల్వాన్ ఘటనతో బుద్ధి తెచ్చుకున్న పాపాన పోలేదు. సరిహద్దు దాటి వచ్చిన చైనా సైనికులు మరో మారు భంగపాటు తప్పలేదు. గల్వాన్, పాంగాంగ్, హాట్ స్ప్రింగ్స్ ప్రాంతమేదైనా…. భారత సైన్యానిదే పైచేయి అవుతోంది. తాజాగా తవాంగ్ ప్రాంతంలోనూ అదే జరిగింది..
చైనా సైనికులు భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించారు. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ దాటి భారత్ ను ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారు. వారిని భారత సైన్యం సమర్థంగా నిలువరించింది. ఇరు దేశాల సైనిక దళాల మధ్య ఘర్షణ కూడా జరిగింది. ఇరువైపుగా గాయపడ్డారు. చైనా వారే ఎక్కువ మంది క్షతగాత్రులైనట్లు తెలుస్తోంది.
గల్వాన్ లాగే ఈ సారి కూడా చైనా సైనికులే ఎక్కువగా గాయపడ్డారు. తర్వాత కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. మధ్యేమార్గంగా ఇరు దేశాల సైనికులు వెనక్కి తగ్గారు. ఈ ఘటన డిసెంబరు 9న జరిగినప్పటికీ భారత సైన్యం చాలా ఆలస్యంగా ఒక లఘు ప్రకటన చేసింది. 2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి ఇరు దేశాల సైనికుల మధ్య ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి.2020లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందగా, 40 మంది చైనా సైనికులు మృతి చెందారు.
చాలా కాలం తవాంగ్ సెక్టార్ నిస్సైనిక ప్రదేశంగా ఉండేది. 2006 తర్వాత ఇరు దేశాల సైనికులు అక్కడ మోహరించారు. అటు వైపు నుంచి ఇండియాలోకి వచ్చేందుకు చైనా సైన్యం ప్రయత్నించడం కూడా ఇది మొదటిసారి కాదు. చాలా సార్లు అలా జరిగినప్పుడల్లా ఇండియన్ ఆర్మీ వారిని ఆపగలిగింది. తాజాగా ఆర్మీ ఏమరపాటుగా ఉన్నప్పుడు చైనా సైనికులు వచ్చేశారు. మన కమాండర్ తక్షణమే రంగ ప్రవేశం చేయడంతో భూభాగాన్ని కాపాడుకోగలిగాం. నిజానికి గల్వాన్ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య వివాదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. పాంగాంగ్ సరస్సు సహా అన్ని వివాదాస్పద ప్రదేశాల ప్రస్తావన జరిగింది. ఆ క్రమంలో ఇరు దేశాల సైనికాధికారుల మధ్య 13 దఫాల చర్చలు జరిగాయి. చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగినా… వాటి వల్ల జరిగిన ప్రయోజనం కనిపించలేదు.
టిబెట్ ను పూర్తిగా స్వాధీనం చేసుకున్న చైనా.. చాలా కాలంగా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం తమవేనని చైనా వాదిస్తోంది. చైనా ప్రజలు, సైనికులు సరిహద్దు దాటి వచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. చీప్ చైనా వస్తువులను ఇండియాలోకి స్మగ్లింగ్ చేసేందుకు కూడా అరుణాచల్ సరిహద్దులను చైనా వినియోగిస్తోంది. అక్కడి సంచార జాతులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందుకే సంచార జాతులపై భారత సైన్యం ఒక కన్నేసి ఉంచుతోంది.
1962 యుద్ధం తర్వాత 3, 400 కిలోమీటర్ల వెంబడి భూభాగం స్పష్టంగా లేదు. దానితో అంతా తనదేనని చెప్పుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. గల్వాన్ ఘటన తర్వాత చైనా మరింతగా వేగం పెంచింది. సరిహద్దుల్లో శాశ్వత సైనిక నిర్మాణాలకు దిగింది. ఇదీ ఇరు దేశాల మధ్య ఒప్పందాలకు విరుద్ధమని తెలిసినా చైనా ముందుకెళ్తోంది. భారత ప్రభుత్వం అభ్యంతరం చెప్పడంతో పనులు ఆపేసినట్లు కనిపించినా నివురు గప్పిన నిప్పులా చేసుకుపోతోంది. 2020 ఘర్షణల తర్వాత అక్కడ తమ సైనికుల సంఖ్యను కూడా పెంచింది. అందుకే ఎప్పుడేం జరుగుతుందోనన్న టెన్షన్ మాత్రం నెలకొంది.