ఏపీ సీఎస్‌గా జ‌వ‌హ‌ర్ రెడ్డి.. అస‌లు క‌థ తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు!

ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటి వరకు జవహర్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. అలాగే టీటీడీ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా, రెండు, మూడు రోజుల్లో ఆయన పదవి బాధ్యతలు స్వీకరించే అవకాశమున్నట్లు సమాచారం. అసాధారణ స్థాయిలో ఇప్పటికే రెండుసార్లు పొడిగింపు పొందిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ పదవీకాలం ఈనెల 30వ తేదీతో ముగుస్తోంది.

ఆయన 2021 అక్టోబరు 1న సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు. అదే ఏడాది నవంబరు 30తో ఆయన రిటైర్‌ అవుతున్నారు. అయితే… రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు కేంద్రం ఆయన సేవలను మరో ఆరు నెలలు పొడిగించింది. ఈ ఏడాది మే 30 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సమీర్‌ శర్మ పదవీకాలాన్ని మరో ఆరునెలలు పొడిగించాలని మరోసారి కేంద్రాన్ని కోరింది. అసాధారణ రీతిలో కేంద్రం ఈ ప్రతిపాదనను కూడా అంగీకరించింది. అంటే… ఈ నెలాఖరుతో ఆయన పదవీకాలం ముగియనుంది.

సమీర్‌ శర్మను వదులుకోవడం ఇష్టంలేకో.. మరో కారణంవల్లో 2023 నవంబరు వరకు ఆయన పదవీకాలం పెంచాలని కేంద్రాన్ని మరోసారి అడిగారు. కేంద్రం అందుకు అంగీకరించలేదు. ఇటీవల ఆయన ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. దీంతో ఈ నెలాఖరుతో ఆయన పదవీ విరమణ ఖాయమైంది.

జ‌వ‌హ‌ర్‌రెడ్డి వెనుక‌..

రాష్ట్ర ప్ర‌భుత్వంలో మ‌రో ఇద్ద‌రు సీనియ‌ర్ అధికారులు ఉన్న‌ప్ప‌టికీ.. సీఎం జ‌గ‌న్ జ‌వ‌హ‌ర్ రెడ్డి వైపు ఎప్పుడో మొగ్గు చూపించారు. అయితే, ఆయ‌న‌ను ఇప్ప‌టికిప్పుడు కాకుండా వ‌చ్చే ఏడాది నియ‌మించాల‌ని అనుకున్న‌ట్టు ఆ మ‌ధ్య తాడేప‌ల్లి వ‌ర్గాలే మీడియాకు లీకులు ఇచ్చాయి. దీనికి కార‌ణం.. 2024 ఎన్నిక‌ల నాటికి కీల‌క‌మైన రెండు స్థానాల్లో త‌న వ‌ర్గం వారిని నియ‌మించాల‌నే సీఎం దూర దృష్టి ఉంద‌ని కొంద‌రు వైసీపీ నాయ‌కులు ఆఫ్ దిరికార్డుగా అప్ప‌ట్లో చెప్పారు.

ప్ర‌స్తుతం ఉన్న డీజీపీ అంటే.. పోలీస్ బాస్‌.. క‌సిరెడ్డి రాజేంద్ర‌నాథ్ రెడ్డి, ఇప్పుడు సీఎస్ గా నియ‌మితుల‌య్యే జ‌వ‌హ‌ర్‌రెడ్డి కూడా ఇద్ద‌రూ కీల‌క స్థానాల్లో ఉంటారు. అంటే ఇద్ద‌రూ కూడా జ‌గ‌న్ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు.. ఆయ‌న ప‌ట్ల విధేయులు. అంతేకాదు.. ఇక్క‌డే మ‌రో ట్విస్ట్ ఉంది. ఇద్ద‌రూ కూడా ఒకే జిల్లా క‌డ‌ప‌కు చెందిన వారు. అది కూడా సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో నెటిజ‌న్లు తాజాగా ఇదే కామెంట్లు చేస్తున్నారు. ఒకే జిల్లా వారిని కీల‌క స్థానాల్లో నియ‌మించ‌డం వెనుక దూర‌దృష్టి బాగానే ఉంద‌ని వ్యాఖ్యానిస్తున్నారు.