400 రోజులు.. 4000 కిలో మీట‌ర్లు.. లోకేష్ పాద‌యాత్ర‌

తాను నిర్వ‌హించ‌నున్న‌ పాదయాత్రపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాజాగా స్పందించా రు. తాను పాద‌యాత్ర చేస్తున్నానంటూ వ‌స్తున్న‌వార్త‌లు నిజ‌మేన‌ని చెప్పారు. వైసీపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై పోరాటంలో భాగంగానే తాను పాద‌యాత్ర చేస్తున్న‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు. రాష్ట్ర వ్యాప్తంగా త‌న పాద‌యాత్ర ఉంటుంద‌ని.. ప్ర‌తిగ్రామం, న‌గ‌రం స‌హా ప‌ట్ట‌ణాల్లోనూ త‌న పాద‌యాత్ర కొన‌సాగుతుంద‌ని తెలిపారు. త‌న త‌ల్లి ఆశీర్వాదంతో ఈ పాద‌యాత్ర‌ను ప్రారంభించ‌నున్న‌ట్టు తెలిపారు.

వ‌చ్చే ఏడాది జనవరి 27 నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర.. 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్లు కొనసాగుతుందని నారా లోకేష్ తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు లోకేష్‌ నడవనున్నారు. మంగళగిరిలో పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. త‌న పాద‌యాత్ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ హాజ‌రు కావాల‌ని.. పార్టీ నాయ‌కుల‌కు నిర్దేశించారు. పాద‌యాత్ర ను జ‌య‌ప్ర‌దం చేసేందుకు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌న్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్న మంగళగిరి నియోజకవర్గంలో 4 రోజులు పాదయాత్ర ఉంటుందని నారా లోకేష్ తెలిపారు. మిగిలిన రోజుల్లో రాష్ట్రమంతా పాదయాత్ర చేయనున్నట్లు లోకేష్‌ వెల్లడించారు. తనని ఓడించేందుకు సీఎం జగన్‌ వాడే అన్ని ఆయుధాలను దీటుగా ఎదుర్కోవాలని పార్టీ నాయ‌కుల‌కు ఆయ‌న‌ పిలుపునిచ్చారు. మంగళగిరిని కాపు కాసే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలని పార్టీ నేతలకు లోకేష్‌ సూచించారు.