ఏపీలో సైలెంట్‌.. తెలంగాణ‌లో వైలెంట్‌

ఏపీలో ప్ర‌ధాని ప‌ర్య‌టించారు.కానీ, ఇక్క‌డ అవినీతి కానీ, ఇక్క‌డ ప్ర‌భుత్వ దూకుడు కానీ, కుటుంబ పాల‌న కానీ, ఆయ‌న‌కు మ‌చ్చుకైనా క‌నిపించ‌లేదు. కానీ, ఇలా విశాఖ నుంచి తెలంగాణ‌ గ‌డ్డ‌పై అడుగు పెట్టారో లేదో.. వెంట‌నే మోడీకి అవినీతి క‌నిపించింది. కుటుంబ పాల‌న క‌నిపించింది.. అంత‌కు మించి చాలానే క‌నిపించాయి. దీంతో నెటిజ‌న్లు.. ఏపీలో సైలెంట్.. తెలంగాణ‌లో వైలెంటా.. మోడీ జీ వాటీజ్ దిస్‌? ! అని కామెంట్లు కుమ్మ‌రిస్తున్నారు.

మ‌రి ఇంత‌కీ మోడీ ఏమ‌న్నారంటే..

అవినీతి, కుటుంబ పాలన ఎంతో కాలం ఉండదని ప్రధాని మోడీ అన్నారు. విశాఖ నుంచి హైదరాబాద్ లోని బేగంపేట్ ఎయిర్‌పోర్టులోకి అడుగు పెడుతూనే ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ఇక్క‌డ కార్యకర్తలను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. తెలంగాణలో అవినీతి రహిత పాలన అందించేందుకు సిద్ధమన్నారు. పేదలను దోచుకునేవారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణలో మూఢనమ్మకాలతో ఏం జరుగుతోందో దేశ ప్రజలకు తెలియాలన్నారు. (సీఎం కేసీఆర్ స‌చివాల‌యాన్ని కొత్త‌గా క‌డుతున్నాడు క‌దా)

కేబినెట్‌లో ఎవరిని ఉంచాలో.. ఎవరిని తీసేయాలో.. మూఢనమ్మకాలు నిర్ణయిస్తున్నాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని దుష్టశక్తులు ఏకమయ్యాయన్నారు. అవినీతిపరులంతా ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. బీజేపీ కార్యకర్తలు బూత్ స్థాయికి వెళ్లాలన్నారు. 22 ఏళ్లుగా ఎందరితోనో ఎన్నో తిట్లు తిన్నాను.. రోజు కిలోల కొద్దీ తిట్లు తింటాను.. అందుకే అలసిపోను.. అని మోడీ అన్నారు. మోడీని తిట్టేవాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ ప‌రోక్షంగా కేసీఆర్‌కు షాక్ ఇచ్చారు.

చక్కగా తిట్లు వింటూ.. చాయ్ తాగుతూ ఎంజాయ్ చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సర్కార్‌కు రోజూ మోడీని తిట్టేందుకే సమయం సరిపోతోందన్నారు. మీరెన్ని తిట్లు తిట్టినా వాటిని అరిగించుకునే శక్తి తమలో ఉందన్నారు. తెలంగాణ సమాజాన్ని తిడితే మాత్రం అంతకంతా ప్రతీకారం తప్పదని మోడీ పేర్కొన్నారు. గతంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టేవన్నారు. కానీ ఆధార్ లింక్ చేసి అవినీతిని అడ్డుకున్నామన్నారు.