గత ఎన్నికలకు ముందు అనూహ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి అందరికీ పెద్ద షాకే ఇచ్చాడు కమెడియన్ ఆలీ. పవన్ కళ్యాణ్‌కు క్లోజ్ ఫ్రెండ్ అయిన ఆలీ.. జనసేనను కాదని, వైసీపీలో చేరడమే అందరూ షాకవ్వడానికి కారణం. ఐతే తనకు ఏ పార్టీ పదవి ఇస్తే ఆ పార్టీలో చేరతానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పిన ఆలీకి వైసీపీ అధినేత జగన్ నుంచి పెద్ద హామీనే తీసుకుని ఆ పార్టీలో చేరి ఉంటాడని అనుకున్నారు. ఐతే అధికారంలోకి వచ్చాక మూడున్నరేళ్లలో ఆలీకి ఏ పదవీ ఇవ్వలేదు. రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని, వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌ను చేస్తారని రకరకాల ప్రచారాలు జరిగాయి కానీ.. అవేవీ నిజం కాలేదు.
ఐతే అటు ఇటుగా ఇంకో ఏడాదిన్నర మాత్రమే ప్రభుత్వ పదవీ కాలం ఉండగా.. ఇప్పుడు ఆలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అనే నామమాత్రపు పదవి ఇచ్చాడు జగన్. ఈ విషయంలో ఆలీ అసంతృప్తితో ఉంటాడని, ఇదేదో కంటితుడుపు చర్యలా ఉందని అందరూ అనుకుంటుంటే ఆలీ మాత్రం.. తనకీ పదవి ఇవ్వడం పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఒక వీడియో ప్రకటనను ఆలీ విడుదల చేశాడు.
“డే-1 వైసీపీ కండువా కప్పుకున్నపుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అడిగారు. ఆలీ పార్టీని ఉద్దేశించే కదా వస్తున్నావు? పదవులు ఆశించి కాదు కదా? అని అడిగారు. ఈ మనిషి మనకు ఉపయోగపడ్డాడు. ఈ మనిషి చెప్పగానే ఆంధ్ర దేశం మొత్తం ప్రచారం చేశాడు. ఈ మనిషికి మనం ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే గతంలో చాలాసార్లు మీడియాలో రాజ్యసభ అని, ఇంకోటి అని వచ్చింది. కానీ ఆ విషయం నేను కానీ, పార్టీ కానీ చెప్పలేదు. కానీ మధ్యలో సీఎం గారిని కలిసినపుడు ఆయన నాకొక మాట చెప్పారు. ఆ ప్రకారమే ఇప్పుడు నన్ను ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించారు. ఆ విషయాన్నే ఇప్పుడు ప్రకటించారు. అందుకు మా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఆ పదవికి న్యాయం చేస్తానని మాటిస్తున్నాను. నా కూతురి పెళ్లి చేస్తున్న సమయంలో మాకు దక్కిన బహుమతిగా దీన్ని భావిస్తున్నాం” అని ఆలీ చెప్పాడు.
పక్కనే ఉన్న ఆలీ భార్య మాట్లాడుతూ.. తమ ఇంట్లో ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొందని, మూడేళ్లుగా బంధువులు, స్నేహితులు ఆలీకి ఏం ఇవ్వలేదని అడుగుతుంటే ఎలా సమాధానం చెప్పాలో తెలియక చాలా టెన్షన్ పడేదాన్నని, ఇప్పుడా టెన్షన్ పోయిందని, ఇదంతా జగనన్న దయ వల్ల జరిగిందని, ఆయనకు ధన్యవాదాలని పేర్కొంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates