విశాఖలో పరిణామాల అనంతరం వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ నేతలపై పవన్ బూతులతో విరుచుకుపడ్డారు. ఇక అదే సందర్భంలో బిజెపికి ఊడిగం చేయబోమంటూ పవన్ చేసిన ప్రకటన జాతీయ స్థాయిలో బీజేపీ నేతలను ఆలోచనలో పడేసింది. బిజెపి అంటే తమకు గౌరవం ఉందని, అలా అని బిజెపి చెప్పిందే చేయడం సాధ్యం కాదని పవన్ చెప్పడంతో ఏపీ బీజేపీ చీఫ్ సోమ వీర్రాజు కూడా ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దలతో భేటీ అయ్యారు.
ఇక, హోటల్లో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టిడిపి అధినేత చంద్రబాబు కలవడం, ఆ తర్వాత ఇద్దరూ కలిసి సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం సంచలనం రేపింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జనసేనతో కలిసి ముందుకు వెళ్తానని చంద్రబాబు ప్రకటించడంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందన్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి. తాజాగా జనసేన, టిడిపి వ్యవహారంపై సోము వీర్రాజు స్పందించారు. జనసేనతో బిజెపి పొత్తు కొనసాగుతుందని సోము అన్నారు. ఇక, ఇటీవల పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటన సందర్భంగా టిడిపి-జనసేన జెండాలు కలిసి కనిపించడంపై కూడా సోము స్పందించారు.
ఆ జెడాలను చంద్రబాబు ఏర్పాటు చేశారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి, జనసేన కలిసి పోటీ చేస్తాయని కూడా సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో జనసేనతో తప్ప మరో పార్టీతో బిజెపికి పొత్తులేదని సోము స్పష్టం చేశారు. ఏపీ బీజేపీలో కోర్ కమిటీ సమావేశాలను సోమ వీర్రాజు నిర్వహించడం లేదని ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు సోమ వీర్రాజు నిరాకరించారు. మరి, తాజాగా సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్పందన ఏ విధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates