ఇప్పటి వరకు తన మాటలతో కడుపుబ్బ నవ్వించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, శాంతి దూతగా పేర్కొనే కేఏ పాల్.. డ్యాన్స్ చేస్తే.. ఎలా ఉంటుంది?.. ఆయన విన్యాసాలు ఎలా ఉంటాయి? అనుకునేవారికి ఆముచ్చట కూడా తీర్చేశారు.. కామెడీ పొలిటికల్ కింగ్.. కేఏ పాల్. మునుగోడులో విస్తృత రేంజ్‌లో ప్రచారం చేస్తున్న పాల్.. గెలుస్తారా? గెలవరా.. అనేది అసలు ఇష్యూనే కాదు. ఆయన ప్రజల నోళ్లపై మాత్రం నాట్యం చేస్తున్నారు. పాల్ వస్తున్నారంటే.. నవ్వులు మోసుకొస్తున్న లెక్కే!! అంతే.. జనాలు ఇళ్లలో పనులు కూడా వదిలేసి.. ఆయన వెంట పడి.. పడి పడి నవ్వుతున్నారు.
తాను గెలిస్తే.. ఆరు నెలల్లోనే మునుగోడును అమెరికా చేస్తానన్న ఆయన కామెంట్ ఇప్పటికీ.. జనం నోళ్లలో నవ్వు ఆగకుండా చేస్తూనే ఉంది. ఎక్కడ విన్నా.. ఎక్కడ కన్నా పాల్ జోకులు పేలుతున్నాయి. అంతేకాదు.. తనకు ఎవరూ సాటి లేరని.. తనకు ఎవరూ పోటీ కారని చెప్పుకొనే.. పాల్.. వార్ వన్ సైడేనని తేల్చేశారు. అంతేకాదు.. ఎన్నికల అధికారులతోనే ఆయన తాను కాబోయే సీఎంనని, ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలని ఆయన హెచ్చరించడం.. కూడా నవ్వులు కురిపించింది. ఇక, తాజాగా ఆయన మునుగోడు పర్యటనలో భాగంగా జనాల్ని మరింత అలరించారు.
ఓ పాటకు తనదైన శైలిలో కాళ్లు చేతులు ఊపుతూ.. డ్యాన్స్ చేశారు. తైతక్కలాడారు. ముద్దులు కురిపించారు. ఇంకేముంది. జనం ఎగబడి మరీ పాల్ డ్యాన్స్‌ను ఆసక్తిగా తిలకించారు. కొందరు యువత ఆయన స్టెప్పులతో ఊగిపోయారు. మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా.. అందరూ పాల్ డ్యాన్స్ చూసేందుకు ఎగబడ్డారంటే.. పాల్ క్రేజ్ను అర్ధం చేసుకోవచ్చు. తనను గెలిపించాలని.. తను వస్తే.. రాష్ట్రాన్ని అమెరికా చేస్తానని.. ఇప్పటికే లక్షల కోట్లు తెచ్చానని.. ఇంకా తెస్తానని.. ఇచ్చానని ఇస్తానని.. ఇలా.. ప్రాస పదాలతో తెలుగునే తికమక పెట్టే స్థాయిలో హామీలు గుపిస్తూ.. తనదైన శైలిలో దూసుకుపోతున్న పాల్.. ఏమేరకు సక్సెస్ సాధిస్తారో తెలియదు.. కానీ, నాటి రేలంగిని మాత్రం మరిపిస్తున్నారని అంటున్నారు ప్రజలు.
Gulte Telugu Telugu Political and Movie News Updates