“మీకేం కావాలో చెప్పండి.. మా సీఎం మీరంటే.. చాలా ఇష్టపడుతున్నారు. మీరు ఏం చేయమన్నా చేస్తారు. ఆ ఒక్కటి తప్ప. రాజకీయంగా కూడా.. మీకు మంచి అవకాశం ఇస్తారు. అవసరమైతే.. రాజ్యసభకు కూడా పంపిస్తారు. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి” ఇదీ.. తాజాగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి, రాజకీయాలకు దూరంగా ఉన్న కాపు నాయకుడు.. ముద్రగడ పద్మనాభానికి వైసీపీ సీనియర్ నాయకులు ఒకరిద్దరు చేసిన ప్రతిపాదన. అయితే.. ఆయన ఈ విషయంలో ఖరాఖండీగా ఏమీ తేల్చేయలేదు.
“చెబుతాను!” అని మాత్రం హామీ ఇచ్చారట. అంతేకాదు.. ఆయన కూడా.. రాజకీయాల్లోకి రావాలనే చూస్తున్నట్టు తూర్పు గోదావరి జిల్లాలోనూ చర్చ సాగుతోంది. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీ.. కాపులకు.. రిజర్వేషన్లపై కొన్నాళ్లు ముద్రగడ ఉద్యమం చేశారు. అయితే.. ఆయన ఈ విషయంలో విఫలమయ్యారు. దీంతో కాపు ఉద్యమం నుంచి తాను తప్పుకొంటున్నట్టు చెప్పుకొచ్చారు. కానీ, తర్వాత.. కాలంలో ఆయన వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారనే వాదన వినిపించింది. దీనిని ఆయన కాదనలేదు. ఔననేలేదు.
పైగా.. మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. కాపులకు వ్యతిరేకంగా ఏవైనా వార్తలు వస్తే.. వెంటనే ఆయన రియాక్ట్ అవుతున్నారు. దీనిని బట్టి ఆయన కూడా.. వైసీపీ వైపు చూస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు.. ఆయనను రిక్వెస్ట్ చేశారని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో వైసీపీ కీలకమైన పరీక్షను ఎదుర్కొన బోతోంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం జనసేన వైపు చూస్తోంది. ఈ క్రమంలో ఆ వర్గం .. తనకు దూరమైతే.. కష్టమనే భావనలో ఉంది. అందుకే.. ఇప్పటికే కాపు వర్గానికి చెందిన చాలా మంది నాయకులకు మంత్రి పదవులు ఇచ్చారు.
అయినప్పటికీ.. మరోవైపు పవన్ దూకుడు పెంచడంతో దీనిని అడ్డుకునేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బలమైన కాపు సామాజిక వర్గానికి వ్యక్తిని పార్టీలోకి చేర్చుకుని.. పవన్ దూకుడుకు అడ్డుకట్ట వేయడం ద్వారా.. ఉభయ గోదావరి జిల్లాల్లోని కాపులు వైసీపీ వెంటే ఉన్నారనే సంకేతాలను పంపించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరి ముద్రగడ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates