ఇంతర్జంటుగా ఢిల్లీకి ఎందుకెళ్ళారబ్బా ?

Bandi Sanjay
Bandi Sanjay

తెలంగాణా బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను అర్జంటుగా రమ్మంటు కేంద్ర హోంశాఖ నుండి కబురందింది. కబురు అందీ అందగానే బండి సాయంత్రం విమానానికి ఢిల్లీకి వెళ్ళిపోయారు. గురువారం ఉదయం హోంశాఖ మంత్రి అమిత్ షా తో అత్యవసర భేటీ ఉందని సమాచారం. ఒకవైపు మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక ప్రక్రియ ఊపందుకుంటున్న సమయంలో ఇంత హఠాత్తుగా బండిని ప్రత్యేకంగా అమిత్ షా పిలిపించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ? అన్నదే ఇపుడు కీలకమైన పాయింట్.

బీజేపీ అధ్యక్షుడి హోదాలో ఉపఎన్నికకు బండే సారథ్యం వహిస్తున్నారు. ప్రచార బాధ్యతలను అప్పగించటంలోను, ప్రచార సరళి పర్యవేక్షించటంలో సంజయ్ చాలా బిజీగా ఉన్నారు. ఇలాంటి నేపధ్యంలోనే ఢిల్లీకి వెళ్ళటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ మంగళవారం అభిషేక్ రావును హైదరాబాద్ లో అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకెళ్ళింది. కోర్టు అభిషేక్ ను మూడురోజుల సీబీఐ కస్టడీకి అనుమతించింది.

లిక్కర్ స్కామ్ వెనకున్న పెద్దతలలు బయటకు రావాలంటే విచారణలో అభిషేక్ చెప్పే వివరాలే చాలా కీలకం. స్కాంలో కేసీయార్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందని ఇప్పటికే బీజేపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్ ఏమిటంటే బుధవారం కేసీయార్, కవిత ఢిల్లీలోనే ఉన్నారు. అభిషేక్ రావు ను సీబీఐ విచారించటానికి, కేసీయార్, కవితలు ఢిల్లీలోనే ఉండటానికి, బండి అర్జంటుగా ఢిల్లీ వెళ్ళటానికి ఏమైనా సంబంధం ఉండుంటుందా ? అనే చర్చ పెరిగిపోతోంది.

పనిలోపనిగా మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అనుకున్నంతగా పుంజుకోలేపోతోందనే ప్రచారం తెలిసిందే. ఈ విషయమై చర్చించేందుకు కూడా అమిత్ పిలిపించుంటారా ? అనే సందేహాలు కూడా పెరుగుతున్నాయి. అయితే మునుగోడు విషయమే అయితే ఫోన్లోనే మాట్లాడేసేవారు కదా. అంటే అంతకన్నా కీలకమైన విషయం ఏమో ఉన్నట్లే ఉందట. అదేమిటో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.