ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయా? ఆ దిశగా ఏపీ వైసీపీ ప్రభుత్వం.. వ్యూహాత్మకంగా అడగులు వేస్తోందా? 2024లో జరగాల్సిన ఎన్నికలను ముందుగానే నిర్వహించాలని భావిస్తోందా? అంటే.. తాజాగా మంత్రి అంబటి రాంబాబు చేసిన ఒకే ఒక్క ట్వీటు ఈ ఆసక్తికర చర్చకు.. రాజకీయ వ్యూహాలకు.. తెరదీసినట్టు తెలుస్తోంది. తాజాగా.. అంబటి రాంబాబు.. ఓ ట్వీట్ చేశారు. అది కూడా.. సీఎం జగన్.. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన తర్వాత.. ఆయన చేసిన ట్వీట్.
“కుప్పం”మే ఓడిపోతుందా!”-అని అంబటి తన ట్వీట్‌లో రాశారు. ఇంతకు మించి ఆయన ఏమీ రాయకపోయినా.. ‘మే’ అన్న ఒక్క మాట.. రాజకీయ సంచలనానికి వేదిక అయింది. కుప్పంపై వైసీపీ ఎప్పటి నుంచో కన్నేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే.. ఇక్కడ.. మినీ మునిసిపాలిటీని ఏర్పాటు చేయడంతో దీనికి అంకురార్పణ జరిగింది. ఇక, తర్వాత.. మునిపల్ ఎన్నికలు నిర్వహించి.. టీడీపీ నేతలను బదాబదలు చేసి.. ఇక్కడ అధికారం దక్కించుకుంది. ఇక, కీలక నేతలను తనదైన శైలిలో వైసీపీ వైపు మొగ్గు చూపేలా చేసింది. పరిణామాలు తీవ్రం అవుతున్నాయని.. చంద్రబాబు గుర్తించారు.
ఈ క్రమంలోనే ఆయన దూకుడుగా వ్యవహరించి.. ఏడాదికి ఒకటి రెండు సార్లు(సంక్రాంతి సమయంలో ఖచ్చితంగా) మాత్రమే కుప్పంలో పర్యటించే ఆయన.. ఈ సారి మాత్రం ప్రతి నెలా కుప్పంలో పర్యటిచారు. నేతలను సమైక్యం చేశారు. అలాంటి పరిస్థితిని కల్పించిన వైసీపీ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించాలనేది ధ్యేయం. అయితే.. దీనిపై ఇలా కాకుండా.. ‘మే’ అనే ప్రయోగం చేయడం వెనుక.. మంత్రి అంబటి వ్యూహాత్మకంగా హింట్ ఇచ్చారా? అనే సందేహాలు వస్తున్నాయి.
ప్రస్తుతం వైసీపీ సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకుంది. అభివృద్ది లేదు. రాదు.. ఈ మాట ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. తమది సంక్షేమ ప్రభుత్వమని కూడా ఢంకా భజాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్షేమం కోసం.. అప్పులు చేస్తున్నారు. దీనిని ప్రజలకే ఇస్తున్నామని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇక, ఇప్పుడు అప్పులు పుట్టే పరిస్థితి సన్నగిల్లింది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సవరం వరకు ఫర్వాలేదు కానీ.. మున్ముందు కష్టమనే సంకేతాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ముందస్తుకు వెళ్లే అవకాశం కనిపిస్తోందని.. కొన్నాళ్లుగా చర్చ సాగుతోంది. అయితే.. దీనిపై ఎలాంటి క్లూ ఇప్పటి వరకు రాలేదు. కానీ.. ఇప్పుడు అంబటి చేసిన ‘మే’ వ్యాఖ్య ను బట్టి.. వచ్చే మేలో ముందస్తు వస్తుందా? అనే చర్చసాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.