వామపక్షాల్లో పోరాట స్పూర్తి తగ్గిపోయినట్లే ఉంది. ఎప్పుడైతే పెద్ద పార్టీలతో పొత్తులు పెట్టుకోవటం మొదలుపెట్టారో అప్పుడే వామపక్షాల పతనం మొదలైంది. అధికారంలో ఉండే కాంగ్రెస్, టీడీపీ లేదా టీఆర్ఎస్ తో పొత్తులకు అర్రులు చాచారో అప్పటినుండే ప్రజాసమస్యలపై పోరాటాలను పక్కనపెట్టేశారు. ఎంతసేపు అధికారంలో ఉన్నపార్టీతో లాలూచీ రాజకీయాలు, లాబీయింగ్ తో వ్యక్తిగత లబ్దికి పాకులాడటం మొదలుపెట్టారో అప్పుడే జనాల్లో కూడా వామపక్షాలపై నమ్మకం పోయింది.
ఇపుడు ఇదంతా ఎందుకంటే మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని సీపీఐ నిర్ణయించింది. ఈరోజే రేపో సీపీఎం కూడా తన నిర్ణయాన్ని ప్రకటించబోతోంది. నిజానికి సీపీఐ+సీపీఎం కలిసి ఉమ్మడి అభ్యర్ధిని రంగంలోకి దింపేంత శక్తి ఉంది. అయినా దాన్ని వదిలేసి టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని సీపీఐ నిర్ణయించటమే ఆశ్చర్యంగా ఉంది. 1985 నుండి జరిగిన ఎన్నికల్లో సీపీఐ 5 సార్లు మునుగోడులో గెలిచింది. అంటే సీపీఐకి బాగా పట్టున్నట్లే అర్ధమవుతోంది. ఈ పార్టీకి సీపీఎం కూడా తోడైతే మిగిలిన పార్టీలకు ఇబ్బందులు తప్పవు.
ఇక్కడ గెలుపోటములను పక్కనపెట్టి వామపక్షాలు రెండు మనస్ఫూర్తిగా కలిసి పనిచేస్తే గెలిచినా ఆశ్చర్యపోవక్కర్లేదు. విచిత్రం ఏమిటంటే మునుగోడులో పోటీ చేయడానికి సీపీఐ సిద్ధంగా లేదని ఆ పార్టీ ప్రకటించటం. అంటే ఉపఎన్నికలో పోటీ చేయకూడదని ముందే సీపీఐ నిర్ణయించుకున్నట్లు అర్ధమవుతోంది. దీనికన్నా విచిత్రం ఏమిటంటే ఇంతకాలం ఏ ప్రభుత్వం మీదైతే పోరాటాలు చేస్తున్నట్లు వామపక్షాలు చెప్పుకుంటున్నాయో ఇపుడు అదే పార్టీకి మద్దతివ్వటం.
టీఆర్ఎస్ కు మద్దతివ్వటం అంటే ప్రజాసమస్యలపై పోరాటాలను పక్కన పెట్టేసినట్లు కాదని ప్రకటించటమే పెద్ద జోక్. ఒకవైపు అధికారపార్టీకి మద్దతిచ్చి మరోవైపు అదే ప్రభుత్వంపై పోరాటాలు చేస్తామంటే నమ్మటానికి జనాలేమన్నా పిచ్చోళ్ళా. ఇలాంటి పిచ్చి నిర్ణయాలు, ప్రకటనలతోనే జనాల్లో వామపక్షాలంటే నమ్మకం కోల్పోయేలా చేసుకున్నాయి. ఇంకా ఎవరిని మభ్యపెట్టడానికి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారో ఎర్రన్నలకే తెలియాలి.