రఘురామ కొత్త ట్విస్టు.. అనర్హత అడ్డుకోవాలంటూ హైకోర్టుకు

గడిచిన కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరో ట్విస్టు ఇచ్చారు. పార్టీకి ఇబ్బంది కలిగించేలా వ్యాఖ్యలు చేయటంతో పాటు.. పార్టీ లైన్ కు భిన్నంగా ఆయన వ్యవహారశైలి ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి పేరిట ఒక నోటీసు అందుకున్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయటమే కాదు.. పార్టీకి చిరాకు తెప్పించేలా కొత్త లా పాయింట్లను తెర మీదకు తీసుకొచ్చారు.

రఘురామ కృష్ణంరాజు తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. ఆయనకు షాకిచ్చేందుకు వీలుగా ప్లాన్ సిద్ధం చేశారు. ఆయనపై అనర్హత వేటు వేసేందుకు వీలుగా ఎంపీలను లోక్ సభ స్పీకర్ వద్దకు పంపనున్న విషయం తెలిసిందే. ఇలాంటివేళ.. రఘురామ ఊహించని విధంగా రియాక్టు అయ్యారు.

తనపై అనర్హత వేటు వేయాలని.. సస్పెన్షన్ చర్యలు తీసుకునేలా పార్టీ యోచిస్తున్నట్లుగా పేర్కొన్నారు. దీన్ని అడ్డుకోవాలని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ వ్యతిరేక చర్యల్ని తాను చేయలేదని స్పష్టం చేసిన రఘురామ కృష్ణంరాజు.. తనపై చర్యల అవకాశం లేకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు.

తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్ మీద షోకాజ్ నోటీసులు వచ్చాయని.. తాను యువజన రైతు శ్రామిక పార్టీ తరఫున ఎన్నికైనందుకు తనకు ఆ పేరు మీద షోకాజ్ నోటీసు ఇవ్వని వైనాన్ని ఎత్తి చూపించానని పేర్కొన్నారు. రఘురామ దాఖలు చేసిన పిటిషన్ సోమవారం ఏపీ హైకోర్టు విచారణకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న మహమ్మారి తీవ్రత కారణంగా అత్యవసర కేసుల్ని మాత్రమే కోర్టు విచారిస్తోంది. రఘురామ తాజా తీరుపై ఏపీ అధికారపక్షం ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.