కేంద్రం మరింత రెచ్చిపోతుందా ?

సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు కేంద్ర ప్రభుత్వం రెచ్చిపోవటానికి మరింత మద్దతిచ్చినట్లే అనిపిస్తోంది. నరేంద్ర మోడీ సర్కార్ ప్రత్యర్ధులపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ, ఐటి లాంటి దర్యాప్తు సంస్ధలను ఉసిగొల్పుతోందంటు గోల పెరిగిపోతోంది. పై మూడింటిలో కూడా ఈడీ చాలా కీలకంగా మారింది. ప్రత్యర్ధి పార్టీల్లోని చాలా మంది పై ఈడీ దాడులు చేసి కేసులు పెట్టడం, అరెస్టులు చేయటం రెగ్యులర్ అయిపోయింది.

ఇలాంటి నేపధ్యంలోనే ఈడీ అధికారాలు, వైఖరిపై కొందరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు చెప్పింది. అదేమిటంటే మనీల్యాండరింగ్ కేసుల్లో అరెస్టులు, సమన్లు జారీచేయటం, ఆస్తులను సీజ్ చేయటంతో పాటు నిందితుడి బెయిల్ కు రెండు కండీషన్లు పెట్టే అధికారాలు కూడా ఈడీకి ఉన్నట్లు స్పష్టంగా చెప్పింది. మనీల్యాండరింగ్ కేసులో నిందితుడి ఆస్తులన్నింటినీ ఈడీ అటాచ్ చేసేయచ్చని కూడా చెప్పింది. కేవలం ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆస్తులను మాత్రమే అటాచ్ చేయాలన్న వాదనను కొట్టేసింది.

మనీల్యాండరింగ్ అంటే తీవ్రవాదం కన్నా తక్కువ నేరం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో కేంద్ర ప్రభుత్వం మరింతగా రెచ్చిపోయే అవకాశముంది. ఇప్పటికే చాలామంది ప్రతిపక్షాల నేతలపై ఈడీ దాడులు చేసి కేసులు నమోదుచేస్తోంది. నిందితులను అరెస్టు చేసే ముందు నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. దర్యాప్తు సంస్ధలను కేంద్రం ప్రత్యర్ధులను వేధించటానికి వాడుకుంటోందనే గోల పెరిగిపోతోంది.

ఈ నేపధ్యంలోనే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేంద్రం చర్యలకు మద్దతుగా నిలిచే అవకాశాలున్నాయి. ఎవరైనా ఎక్కడైనా మనీల్యాండరింగ్ కు నిజంగానే పాల్పడుంటే వారిపైన దాడులు చేయటం, కేసులు నమోదు చేయటంలో తప్పేలేదు. బెంగాల్లో పరిశ్రమల శాఖ మంత్రి పార్ధా ఛటర్జీ పై దాడులు చేసిన ఈడీ కేసులు నమోదుచేసింది. ఇందులో ఎలాంటి తప్పులేదు. కానీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటు గతంలో కేసులు కూడా నమోదైన కొందరు బీజేపీలో మారిపోగానే వారిపైన ఎలాంటి చర్యలు ఉండటం లేదు. ఇక్కడే సమస్యంతా వస్తోంది.