కాపు ఉద్యమ నాయకుడు.. ముద్రగడ పద్మనాభం రూటు మార్చారా? టీడీపీవైపు చూస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రాజకీయ పరిశీలకులు. గత ఎన్నికలకు ముందు ఆయన టీడీపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు గుప్పించారు. నిరసన వ్యక్తం చేశారు. దీంతో ముద్రగడ అనుకూల వర్గం.. టీడీపీని వ్యతిరేకించింది. ఇది అప్పట్లో వైసీపీకి మేలుచేసిందనే విశ్లేషణలు వచ్చాయి. పైగా.. ముద్రగడ కూడా.. వైసీపీని కాపుల రిజర్వేషన్ విషయంలో బలవంతం చేయలేదు.
దీంతో గత మూడేళ్లుగా కాపుల హక్కులపై ఎవరూ గళం వినిపించలేదు. ఇదిలావుంటే.. ఇప్పుడు.. వైసీపీ ఇమేజ్ తగ్గిపోతోందని.. వార్తలు వస్తున్న నేపథ్యంలో ముద్రగడ కూడా వ్యూహం మార్చుకున్నారని తెలుస్తోంది. ఎందుకంటే.. ప్రస్తుతం కాపుల్లో మళ్లీ.. చంద్రబాబు స్వరం వినిపిస్తోంది. ఆయన ఉన్న కాలంలో కాపులకు అనేక పథకాలు ప్రత్యేకంగా అమలు చేశారు. ఉన్నత విద్య సహా.. కాపులకు ప్రత్యకంగా సంక్షేమ పథకాలు అమలు చేశారు.
అయితే.. ఇప్పుడు ప్రత్యేకంగా ఎలాంటి పథకాలు లేవు. పైగా.. కాపు కార్పొరేషన్ కూడా ఏమీ చేయలేక పోతోంది. నిధులు కూడా లేవు. దీంతో వైసీపీపై కాపులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ఎలానూ యూటర్న్ తీసుకున్న నేపథ్యంలో తాను కూడా మారకపోతే.. ఉన్న గుర్తింపు కూడా ఉండదని.. ఆయన భావించారో ఏమో.. ఇప్పుడు టీడీపీ వైపు అడుగులువేస్తున్న పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.
తాజాగా ముద్రగడ అనుచరుడు.. ఏసుబాబు.. టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. యనమల రామకృష్ణుడును కూడా కలిసి .. ఆయనతో చర్చించారు. త్వరలోనే ఏసుబాబు.. టీడీపీలో చేరిక ఖాయమనే సంకేతా లు వస్తున్నాయి. అయితే..ఏసుబాబు ఏం చేసినా.. ముద్రగడ అనుమతి తీసుకోకుండా..అడుగు కూడా వేయరని అంటారు. ఈ నేపథ్యంలో ఏసుబాబును టీడీపీలోకి పంపించడం ద్వారా.. ముద్రగడ టీడీపీకి అనుకూలమనే సంకేతాలు పంపుతున్నారనే వాదన తెరమీదికి వచ్చింది. ఇప్పటికే.. ఆయన టీడీపీ సీనియర్ నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడును కలిశారు. ఈ పరిణామాలను గమనిస్తే.. ముద్రగడ రాజకీయ వ్యూహం ఆసక్తిగా మారిందని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates