బ్రాండ్ హైదరాబాద్.. ఎప్పటికీ చంద్రబాబుదే: మాంటెక్ సింగ్

ఇటీవల కాలంలో బ్రాండ్ హైదరాబాద్ తో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఆ మాటకు వస్తే హైదరాబాద్ ను మరో లెవల్ కు తీసుకెళ్లిన ఘనత తమ సొంతమన్నట్లుగా కల్వకుంట్ల ఫ్యామిలీ తెగ మాటలు చెబుతున్న పరిస్థితి. హైదరాబాద్ కు అసలు సిసలు బ్రాండ్ తీసుకొచ్చిన నేత ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే అన్న మాట ఎవరి నోటి నుంచైనా వస్తే చాలు.. ఇష్టపడని వారిలో కల్వకుంట్ల ఫ్యామిలీ ఫస్ట్ ఉంటుందని చెప్పక తప్పదు. ఇలాంటి వేళలో.. ఎవరూ పల్లెత్తు మాట అనేందుకు ఇష్టపడని ఒక ప్రముఖ వ్యక్తి.. చంద్రబాబు దక్షతను కొనియాడటమే కాదు.. బ్రాండ్ హైదరాబాద్ కోసం పడిన కష్టం గురించి తనకు తానే స్వయంగా చెప్పిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

చంద్రబాబు పని తీరును.. ఇప్పటి హైదరాబాద్ ఇమేజ్ కు బాటలు వేయటంలో చంద్రబాబు చేసిన ప్రయత్నాల్ని.. పడిన కష్టాల్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పుకొచ్చారు ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు అనే అంశంపై మాట్లాడటానికి హైదరాబాద్ వచ్చిన ఆయన.. తన ప్రసంగంలో భాగంగా విజన్ ఉన్న నేతలు ఎలా ఉంటారన్న అంశాన్ని చెప్పే క్రమంలో చంద్రబాబు ప్రస్తావన తెచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు గురించి ఆయనేమన్నారన్నది చూసినప్పుడు.. హైదరాబాద్ ఇమేజ్ కోసం చంద్రబాబు పడిన కష్టం ఎంతన్నది ఇట్టే అర్థమైపోతుంది.

అహ్లూవాలియా మాటల్లోనే చెబితే.. ‘కలలు కనటం.. వాటిని సాకారం చేసుకోవటానికి నిరంతరం క్రషి అవసరం. అందుకు ఉదాహరణే సైబరాబాద్. దీని నిర్మాణం వెనుక చంద్రబాబు పడిన కష్టం ఎంతో ఉంది. ఆయనో బోల్డ్ అండ్ అన్ యూజువల్ పర్సన్. అనాడు చంద్రబాబు అమలు చేసిన సంస్కరణల ఫలితమే ఇప్పుడు సైబరాబాద్ అనే ఖ్యాతిగా కనిపిస్తోంది. హైదరాబాద్ ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారంతా చంద్రబాబుకు థ్యాంక్స్ చెప్పాల్సిందే.

అప్పట్లో ఢిల్లీ పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను కలిసేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నం చేశారు. తనను తాను ఆంధ్రప్రదేశ్ సీఈవోగా పరిచయం చేసుకొని.. అపాయింట్ మెంట్ తీసుకున్నారు. అతి కష్టమ్మీద బిల్ గేట్స్ అపాయింట్ మెంట్ తీసుకొని.. 90 నిమిషాల పాటు తన విజన్ వివరించారు. అంతే.. బిల్ గేట్స్ చంద్రబాబు వెంట హైదరాబాద్ కు వచ్చారు’’ అంటూ అప్పట్లో జరిగిన విషయాల్ని గుర్తు చేసుకున్నారు.

రాజకీయంగా చంద్రబాబు కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. కానీ.. కార్యనిర్వాహణ విషయంలోనూ.. పాలనా రంగంలోనూ ఆయన చేసిన మేళ్లను మర్చిపోలేం. కష్టం వచ్చినప్పుడు కానీ.. విపత్తు విరుచుకు పడినప్పుడు చంద్రబాబు రియాక్టు అయ్యే పద్దతికి.. ఇప్పటి ముఖ్యమంత్రులు స్పందించే తీరుకు తేడా ఇప్పటికే కనిపిస్తోంది. చంద్రబాబు దక్షతను ఒక ప్రముఖుడు వివరించిన వైనం చూసినప్పుడు బ్రాండ్ హైదరాబాద్ కు సైబరాబాద్ ను జోడించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే అవుతారన్న విషయం అహ్లూవాలియా మాటలతో స్పష్టమైందని చెప్పాలి.