కేంద్రం ప‌రువు తీయండి.. ఎంపీల‌కు కేసీఆర్ ఆదేశం

తెలంగాణ‌పై కేంద్రం చూపుతున్న వివ‌క్ష‌ను ఏకేయాల‌ని.. పాయింట్ల వారీగా.. కేంద్రం ప‌రువు తీయాల‌ని.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న పార్టీ ఎంపీల‌కు దిశానిర్దేశం చేశారు. ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గే ప్ర‌శ్నే లేద‌న్నారు. విష‌యం ఏదైనా దూకుడుగా వ్య‌వ‌హ‌రించాల‌ని.. అడుగ‌డుగునా అడ్డు ప‌డాల‌ని సూచించారు. ప్రగతిభవన్‌లో నిర్వ‌హించిన టీఆర్ ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం కేసీఆర్ సుదీర్ఘ ప్ర‌సంగం చేశారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఈ స‌మావేశానికి హాజరయ్యారు.

ఈ నెల 18 నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల దృష్ట్యా.. ఉభయసభల్లో టీఆర్ ఎస్‌ నేతలు అనుసరించాల్సిన విధివిధానా లపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎంపీలకు సూచించారు. తెలంగాణపై వివక్షను ఎత్తిచూపేలా.. పార్లమెంటు వేదికగా కేంద్రప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని.. ధాన్యం కొనుగోళ్లపైనా పోరాడాలని ఎంపీలకు మార్గనిర్దేశం చేశారు. ఎవ‌రూ వెనుకంజ వేయాల్సిన అవ‌స‌రం లేద‌ని.. దాడుల‌కు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు.

పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో.. కేంద్రంపై పోరాటానికి కలసి రావాలని వివిధ రాష్ట్రాల సీఎంలు, నేతలతో ఇప్పటికే సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. మమతా బెనర్జీ, అర్వింద్ కేజ్రీవాల్‌, తేజస్వీ యాదవ్, అఖిలేశ్ యాదవ్‌, శరద్ పవార్‌లతో పలు అంశాలపై చర్చించారు. పార్లమెంటు వేదికగా కేంద్రప్రభుత్వంపై పోరాడదామని సీఎం కేసీఆర్ తెలిపారు. అందుకు నేతలు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.