బాదుడే బాదుడు.. టీడీపీ భవిష్యత్ మారిపోతుందా ?

బాదుడే బాదుడుతో మారిపోతుందనే చంద్రబాబునాయుడు నమ్ముతున్నారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మినీమహానాడు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాదుడేబాదుడు కార్యక్రమానికి జనాల్లో విశేష స్పందన కనిపిస్తోందన్నారు. ఇప్పటివరకు పార్టీ కవర్ చేసింది కేవలం 16 శాతం ఇళ్ళను మాత్రమే అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ వైఫల్యాలను, అరాచకాలను జనాలకు వివరించాలని చంద్రబాబు ఆదేశించారు. ఇందులో భాగంగానే చంద్రబాబు పోయిన నెలలోనే బాదుడే బాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో భాగంగా 16 శాతం ఇళ్ళను కవర్ చేసినందుకే అధికార పార్టీ నేతలు, ప్రభుత్వం తట్టుకోలేక పోతున్నట్లు చెప్పారు. ఇదే కార్యక్రమాన్ని వందశాతం పూర్తిచేస్తే ప్రభుత్వం పరిస్థితి ఎలాగుంటుందో అందరు ఆలోచించుకోవాలన్నారు.

కాబట్టి నేతలు, కార్యకర్తలు అందరూ కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి కచ్చితంగా 5-10 శాతం అదనంగా వచ్చే అవకాశముందన్నారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి 49.9 శాతం ఓట్లు వచ్చాయి. ఇదే సమయంలో టీడీపీకి వచ్చిన ఓట్లు 39.26 శాతం. అంటే చంద్రబాబు తాజాగా చెప్పిన ప్రకారం వచ్చే ఎన్నికల్లో పార్టీకి 43 శాతం కానీ లేదా 48 శాతం కానీ ఓట్లు వచ్చే అవకాశముంది. ఒక పార్టీకి ఒక్కసారిగా 48 శాతానికి ఓట్లు పెరగటమంటే మామూలు విషయం కాదు.

అధికార పార్టీ పరిపాలనలో ఘోరంగా ఫెయిలైతే కానీ ప్రతిపక్షానికి అంతగా ఓట్ల శాతం పెరగదు. ఇదే సమయంలో ప్రతిపక్షం కూడా అంత ఓట్లశాతాన్ని పెంచుకునేందుకు జనాల్లో నమ్మకం పెంచుకున్నదా అన్నది కూడా కీలకమే. జనాల్లో విశ్వసనీయత పెంచుకోకుండా ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్లే తమకు ఓట్లు వచ్చేస్తాయని అనుకుంటే అది భ్రమే అవుతుంది. ప్రభుత్వంపై జనాల్లో నిజంగానే వ్యతిరేకత ఉంటే అప్పుడు ప్రతిపక్షం చేసే నిరసనలు, ఆందోళన కార్యక్రమాలతో మాత్రమే విశ్వసనీయతను పెంచుకోగలదు. కాబట్టి చంద్రబాబు చెప్పిన ఓట్ల శాతం పెరిగే విషయం తేలాలంటే వెయిట్ చేయాల్సిందే. 

అయితే… 2014లో చంద్రబాబు చేసిన తప్పులతో పోలిస్తే 2019లో జగన్ చేస్తున్న తప్పులు ఏమాత్రం తీసిపోవు… ఒకింత ఎక్కువే అని చెప్పాలి. 2014 కి 2019 కి జగన్ ఓట్ల శాతం 13 శాతం పైగా పెరిగినపుడు… 2024లో టీడీపీ కేవలం 6 శాతం ఎక్కువ మాత్రమే ఎక్స్ పెక్ట్ చేస్తోంది. కాబట్టి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టే టీడీపీ క్యాడర్ భావిస్తోంది. అయితే… ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయన్నది కూడా పాయింటే.