ఏపీ సర్కారుపై నిప్పులు చెరగాలనేది ఒక కాంక్ష అయితే.. అదేసమయంలో పార్టీ అధినేత దగ్గర మంచి మార్కులు వేయించుకుని ట్రెండింగ్‌లో ఉండాలనే మరో కాంక్ష కారణంగా.. టీడీపీ నాయకులు గాడి తప్పుతున్నారనే వాదన వినిపిస్తోంది. రాజకీయ నేతలు ప్రత్యర్థి పార్టీలపై పైచేయి సాధించాలని అనుకోవడం.. ప్రజల నుంచి మెప్పు పొందాలని అనుకోవడం.. ఇప్పుడు కొత్తకాదు. అసలు రాజకీయం అంటేనే.. దూకుడు ఉండాలి. కానీ, ఈ దూకుడు ఇప్పుడు.. పార్టీ అధినేతను డిఫెన్స్‌లో పడేలా చేస్తోందనే వాదన టీడీపీలో వినిపిస్తోంది.
గతంలోనూ.. ఇప్పుడు కూడా.. తన పద్ధతి మార్చుకోని.. నేతల కారణంగా.. చంద్రబాబు విమర్శలు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయొచ్చు. అయితే.. వ్యక్తిగత కారణాలు.. పరుష పదజాలాలు.. డబుల్ మీనింగ్ డైలాగులు ఏ నేతకు.. ఏపార్టీకి కూడా శోభనివ్వరు.
అయితే.. తాజాగా నిర్వహించిన టీడీపీ మినీ మహానాడులో మాజీ మంత్రి అయ్యన్న అన్ని లక్ష్మణ రేఖలను దాటేశారనే విమర్శలు వస్తున్నాయి. నాలుగు గోడల మధ్యన, మన అనుకున్న సన్నిహితుల మధ్యన మాట్లాడుకోవాల్సిన మాటలను ఆయన బహిరంగ వేదికలపై మాట్లాడడాన్ని టీడీపీ సానుభూతి పరులు కూడా తప్పుపడుతున్నారు.
ముఖ్యంగా `మగతనం టెస్ట్ చేసుకునేందుకు.. నన్ను రమ్మంటావా.. లోకేష్ బాబును పంపించమంటావా?“ అంటూ.. మంత్రి స్తాయిలో రోజాను విమర్శించడం.. తప్పనే భావన వ్యక్తమవుతోంది. రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేసుకోవచ్చు. కానీ, అది శృతి మించితే.. కష్టమని తెలియని నాయకుడు అయితే.. అయ్యన్న కాదు. గతంలోనూ సీఎం జగన్ ను నా కొడుకు అని సంభోదించి సమర్ధించుకున్నారు. ఇక, ఇప్పుడు మళ్లీ మళ్లీ ఇదే మాట వాడారు. మరి ఇవన్నీ.. ఆ క్షణానికి ఆయన కు బాగానే ఉండి ఉన్నా.. తర్వాత వైసీపీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి చంద్రబాబుకు వస్తోంది.
ప్రతి విషయాన్ని వడ్డీతో సహా.. అన్నట్టుగా వైసీపీ నాయకులు.. చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. దీనికి ఆయన సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది. ఎలానూ బ్యాడ్ నేమ్ ఉన్న వైసీపీకి ఇప్పుడు ఒరిగేది లేకపోయినా.. మేధావులు సైతం మెచ్చుకునే బాబు మాట తీరు.. పార్టీ విదానాలు ఇప్పుడు అభాసు పాలవుతున్నాయి. ఒకవేళ అయ్యన్న ఏమైనా మాట్లాడాలని అనుకుంటే.. చంద్రబాబు సమక్షంలో ఎందుకు? ఆయనను ఇరికించకుండా.. వ్యక్తిగతంగా ప్రెస్‌మీట్ పెట్టి తిట్టుకుంటే .. ఆ ఎఫెక్ట్ వేరేగా ఉండేదని.. పరిశీలకులు అంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఒక్క ఓటును కూడా పార్టీకి చేరువ చేయలేవని చెబుతున్నారు. మరి ఈ విషయాన్ని తెలియకపోతే.. తెలుసుకుంటే మంచిదనే సూచనలు వస్తున్నాయి.