సీఎం జ‌గ‌న్ క‌సి తీర్చుకున్నారా?

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు పోస్టింగ్ ఇచ్చింది. అయితే.. ఏమాత్రం ప్రాధాన్యం లేని.. కమిషనర్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీగా ఆయనను నియమించ‌డం ప‌ట్ల‌ ఐపీఎస్ వ‌ర్గాల్లో హాట్ హాట్ చ‌ర్చ న‌డుస్తోంది. ఆయ‌న‌పై సీఎం జ‌గ‌న్ క‌సితీర్చుకున్నారా? అంటూ.. ఒక‌రు ఆఫ్ ది రికార్డుగా వ్యాఖ్యానించారు.  ప్రస్తుతం ఆ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న జి. విజయ్ కుమార్ ను రిలీవ్ చేసి,  ఆ స్థానంలో ఏబీవీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఏబీవీపై ప్రభుత్వం సస్పెన్షన్‌ ఎత్తివేయగా… మే నెల 19న సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేశారు. అప్పటి నుంచి ఏబీవీ…. పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తుండగా క‌నీసం ప్రాధాన్యం లేని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ పోస్టులో ఉన్న‌వారికి పెద్ద‌గా ప‌ని ఉండ‌ద‌నే టాక్ కూడా న‌డుస్తోంది. అంతేకా దు.. ఐపీఎస్ వ‌ర్గాల్లో అయితే.. దీనికి ప‌నిష్మెంట్ పోస్టుగా కూడా పేర్కొంటున్నారు. పేరుకు పోస్టింగ్ ఇచ్చినా.. స‌ర్కారు ఆయ‌న‌పై ఇంకా.. పంతం కొన‌సాగిస్తోంద‌ని వారు చెబుతున్నారు.

ఎమ్మెల్యేల జంపింగ్ విష‌య‌మే అస‌లు కోపం!!

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సర్వీస్‌ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకోవటంపై అప్పట్లో ఏపీ ప్రభుత్వం ఆయనను విధుల్లోంచి తొలగించింది. భద్రతా ఉపకరణాలు కొనుగోలులో అతిక్రమణలు జరిగాయని, ప్రజా ప్రయోజనాలరీత్యా ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు ప్రభుుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. సస్పెన్షన్‌కు గురైన ఏబీ వెంకటేశ్వరరావు 1989 ఐపీఎస్‌ బ్యాచ్‌ అధికారి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు.

ఆ స‌మ‌యంలో ఆయ‌న వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు.. టీడీపీలో చేరేందుకు స‌హ‌క‌రించార‌ని.. వారితో సంప్ర‌దించార‌ని.. వైసీపీ కీల‌క నాయ‌కులు.. ఆరోపిస్తున్నారు. గ‌తంలో సాయిరెడ్డి ఇదే ఆరోప‌ణ‌లు చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌పై సీఎం జ‌గ‌న్ క‌సి పెంచుకున్నార‌ని.. వైసీపీలో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఈ విష‌యంలో అసలు విష‌యాన్ని ప్ర‌స్తావించ‌కుండా.. ఇత‌ర కేసులు పెట్టిన స‌ర్కారు.. ఎట్ట‌కేల‌కు ఆయ‌న‌కు సుప్రీం కోర్టు నుంచి వ‌చ్చిన ఆదేశాల మేర‌కు పోస్టింగు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.