ఆంధ్రావనికి సంబంధించి పనిచేస్తున్న ఆదాయ వ్యయాలకు సంబంధించి ఓ వివరం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడి చేసిన వివరం ప్రకారం ఏపీలో వైసీపీ ఆదాయం బాగానే ఉన్నా, ఖర్చు మాత్రం తక్కువగానే ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో పార్టీలకు విరాళాల రూపంలో దక్కే ఆదాయం విషయంలో టీడీపీ వెనుకంజలో ఉంది. ఖర్చులో అందరి కన్నా ముందుంది.
ఆ లెక్కల్లో వైసీపీ ఆదాయం వంద కోట్లకు పైగా ఉంటే ఖర్చు కేవలం 80 లక్షలే అని తేలింది. అదే టీడీపీ ఆదాయం మూడు కోట్లు ఉంటే, ఖర్చు 54 కోట్లకు పైగా ఉందని తేలింది. అదేవిధంగా టీఆర్ఎస్ లెక్కలు కూడా తేలాయి. టీఆర్ఎస్ కు ఆదాయ రూపంలో 37.65 కోట్ల రూపాయల మేరకు విరాళాలు రాగా, ఖర్చు 22.34కోట్లు అని తేలింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి అందించిన వివరాల ఆధారంగా పై గణాంకాలు అన్నవి వెలుగు చూశాయి.
ముఖ్యంగా ఆదాయంలో తెలుగు రాష్ట్రాలలో వైసీపీ బాగుంది. స్థిరా ఆస్తుల కూడికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి బాగుందని ఓ వివరం అప్పట్లో వెలుగు చూసింది. స్థిర ఆస్తుల విషయంలో వైసీపీ కాస్త వెనుకంజలోనే ఉంది. ఎందుకంటే వైసీపీ కి ఆదాయం బాగున్నా సొంత పార్టీ కార్యాలయాలన్నవి జిల్లాలలో పెద్దగా లేవు. కానీ టీడీపీకి స్థిర ఆస్తులు బాగానే ఉన్నాయి. అవి కేవలం ఆంధ్రాకే కాకుండా తెలంగాణలోనూ ఉన్నాయి. ఓ విధంగా ప్రాంతీయ పార్టీల నడవడిలో ఎప్పటి నుంచో ఆదాయ పరంగా టీఆర్ఎస్ ముందుంటూ వస్తోంది.
ఆ తరువాతే ఏ పార్టీ అయినా.. ఇక విరాళాల రూపంలో దక్కే డబ్బు విషయమే మాట్లాడుకుంటే టీడీపీ ప్రస్తుతానికి కాస్త వెనుకంజలో ఉంది. వైసీపీ మాత్రం దూసుకుపోతోంది. ఆదాయపరంగా చూసుకుంటే దక్షిణాది రాష్ట్రాలలో డీఎంకేది టాప్ పొజిషన్..149.95 కోట్ల రూపాల మేరకు ఆదాయాన్ని విరాళ రూపంలో ఆర్జించింది. విరాళాల ఖర్చులో మాత్రం వైసీపీనే వెనుకంజలో ఉందని తాజా ఆడిట్ వివరాలు వెల్లడిస్తున్నాయి.