కేసీఆర్ పీఛేముడ్‌.. ఢిల్లీలో ఏం జ‌రిగింది?

ఎన్నో ఆశ‌ల‌తో హ‌స్తిన బాట‌ప‌ట్టిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అనూహ్యంగా వెనుదిరిగారు. క‌నీసం ఈ నెల 27 వ‌ర‌కు ఆయ‌న ఢిల్లీ స‌హా.. మ‌హారాష్ట్ర, క‌ర్ణాట‌క‌ల్లోనూ ప‌ర్య‌టించాల‌ని ముందుగా షెడ్యూల్ నిర్ణ‌యిం చుకున్నారు. మ‌రీ ముఖ్యంగా ఈ నెల 26న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ హైద‌రాబాద్ వ‌స్తున్న నేప‌థ్యం లో కేసీఆర్ డిల్లీ టూర్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. మోడీకి మొహం చూపించలేకే ఆయ‌న హ‌స్తిన ప‌ర్య‌ట‌న పెట్టుకున్నార‌ని.. ఇప్ప‌టికిప్పుడు అంత అవ‌స‌రం ఏమొచ్చింద‌ని. బీజేపీ నాయ‌కులు ఏకేశారు.

అయిన‌ప్ప‌టికీ.. కేసీఆర్ ఈ విమ‌ర్శ‌ల‌ను లెక్క చేయ‌కుండానే ముందుకు సాగారు. ఈ నెల 22నే ఢిల్లీకి వెళ్లిన ఆయ‌న రెండు రోజుల పాటుఅక్క‌డ యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్‌తో భేటీ అయ్యారు త‌ర్వాత‌.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తోను భేటీ అయి.. విందు భోజ‌నం స్వీక‌రించారు. త‌ర్వాత‌.. పంజాబ్ రైతుల‌ను క‌లుసుకున్నారు. వారికి ఇస్తాన‌ని హామీ ఇచ్చిన మేర‌కు ప‌రిహారం కూడా ఇచ్చారు. ఇంత‌వ‌ర‌కు బ‌య‌ట‌కు తెలిసిన విష‌యాలు. అదేస‌మయంలో ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో భవిష్య‌త్ వ్యూహాల‌ను కూడా కేసీఆర్ చ‌ర్చించార‌ని డిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

మ‌రీ ముఖ్యంగా.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. జాతీయ‌స్థాయిలో చ‌క్రం తిప్పాల‌ని.. సంచ‌ల‌నాలు చోటు చేసుకోబోతున్నాయ‌ని కూడా..కేసీఆర్ ప్ర‌క‌టించ‌డం.. ఈ అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచింది. మ‌రి ఈ దూకుడుకు అనూహ్యంగా ఎందుకు బ్రేకులు ప‌డ్డాయ‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. దీనికి ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్న‌కీల‌క విష‌యాలు మూడు క‌నిపిస్తున్నాయి. ఇంకా వేచి చూడాల‌నేది ఇత‌ర బీజేపీ యేత‌ర‌ రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల మాటగా ఉంద‌ని అంటున్నారు. ఎందుకంటే. ప్ర‌స్తుతం మోడీ హ‌వా కొన‌సా గుతూనే ఉంది. ఇదేస‌మయంలో ఈ ఏడాది చివ‌రి నాటికి నాలుగు రాష్ట్రాల‌లో ఎన్నిక‌లు ఉన్నాయి.

రాజ‌స్థాన్‌, క‌ర్ణాట‌క‌, గుజ‌రాత్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో ఎన్నిక‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాల ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కు వేచి చూడాల‌ని.. అప్ప‌టికి.. వ‌చ్చే ఫ‌లితాన్ని అంచ‌నా వేసుకుని ముందుకు సాగాల‌నేది ఇత‌ర రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల ఆలోచ‌న‌గా ఉన్న‌ట్టు చెబుతున్నారు. దీనికి తోడు.. 2024 ఎన్నిక‌ల‌కు క‌లిసి వ‌చ్చే పార్టీల‌పైనా.. క్లారిటీ రాలేద‌ని తెలుస్తోంది. మ‌హారాష్ట్రలో కీల‌క‌మైన ఎన్సీపీ అధినేత ప‌వార్ ఊగిస‌లాట‌లో ఉన్నారు.

రేపు ఆయ‌న‌ను ఉప‌రాష్ట్ర‌ప‌తి పోస్టుకు బీజేపీ సిఫార‌సు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యం లో ఇప్ప‌టికిప్పుడు ఇలాంటి వారుఎటువైపు మొగ్గుచూపుతార‌నే విష‌యం సందేహంగానే ఉంది. ఈ నేప‌థ్యంలోనే కేసీఆర్‌.. త‌న ప్ర‌య‌త్నాలు విర‌మించుకుని.. పీఛేముడ్ అంటూ.. హైద‌రాబాద్ బాట‌ప ట్టార ని అంటున్నారు. అయితే.. కేసీఆర్ రాబోయే రెండుమూడు మాసాల్లో త‌న ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. అదేస‌మ‌యంలో తెలంగాణ‌లో ప్ర‌చారం కోసం.. ఢిల్లీ, యూపీ ల నుంచి నాయ‌కుల‌ను తీసుకువ‌చ్చేందుకు కూడా ఆయ‌న వ్యూహాలు సిద్ధం చేస్తున్నార‌నిస‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.