టీడీపీ అధినేత చంద్రబాబు.. రాజకీయ పొత్తులపై తొలిసారి పెదవి విప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అన్ని పార్టీలూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమం నిర్మించాలని.. దీనికి టీడీపీ నాయకత్వం వహిస్తుందని తేల్చి చెప్పారు. “ఏపీలో ప్రజా ఉద్యమం రావాలి. ఈ ప్రజా ఉద్యమానికి టీడీపీ నాయకత్వం వహిస్తుంది. ఈ విషయంలో టీడీపీ ఎన్నిత్యాగాలు చేసేందుకైనా సిద్దం. ఇప్పటికే మాతో కలిసి పనిచేసేందుకు సీపీఐ సిద్ధంగా ఉంది” అని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాకినాడ జిల్లాలో టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అవినీతిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన సమయం వచ్చిందన్నారు. కరెంటు రాదు.. కానీ, బిల్లులు మాత్రం వస్తాయని.. సర్కారు తీరును ఆయన ఎండగట్టారు. జగన్ దెబ్బకు కింగ్ ఫిషర్ పోయిందని.. అన్నారు. బాబాయి హత్య మాదిరిగా .. మిమ్మల్ని.. నన్ను కూడా హత్య చేసేందుకు ఈ ప్రభుత్వం వెనుకాడడం లేదని వ్యాఖ్యానించారు.
రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు జగన్ కంకణం కట్టుకున్నారని..చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్తును జగన్ అంధకారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపైనే తన పోరాటం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర పరిస్థితి చూసి.. ఆవేదన, ఆందోళన కూడా కలుగుతున్నాయని చెప్పారు. ఆడబిడ్డలపై అత్యాచారాలు జరుగుతుంటే.. మహిళా మంత్రి.. తల్లులను తప్పుపట్టడం ఎంత దారుణమో.. అందరూ అర్ధం చేసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
జంగారెడ్డి గూడెంలో చోటు చేసుకున్న కల్తీ సారా మరణాలను సహజ మరణాలుగా జగన్ చెప్పారని.. ఇంతకన్నా.. ఘోరం ఏం ఉంటుందని అన్నారు. దేశంలో పెట్రోల్ , డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏపీనేనని చంద్రబాబు చెప్పారు. క్విట్ జగన్-సేవ్ ఆంధ్ర నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని.. చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు నేతలకు సూచించారు. టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టినా.. తాము ప్రజల కోసం.. పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates