ఈట‌ల పై కేసీఆర్ కోపం త‌గ్గ‌లేదా…

దాదాపు ఏడాది కింద‌ట‌, సంచ‌ల‌న రీతిలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య‌నేత‌గా ఉన్న ఈట‌ల రాజేంద‌ర్ మంత్రి ప‌ద‌వి నుంచి ఉద్వాస‌న‌కు గురైన సంగ‌తి తెలిసిందే. త‌న‌ను అన్యాయంగా టార్గెట్ చేశార‌ని ఆవేద‌న చెందిన ఈట‌ల టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి అనంత‌రం వ‌చ్చిన ఉప ఎన్నిక‌ల్లో ఆయ‌న బీజేపీ త‌ర‌ఫున బ‌రిలో దిగి సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డం ద్వారా త‌న స‌త్తా చాటారు.

ఇదిలాఉంటే, ఇప్ప‌టికీ గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్‌కు త‌ను అంటే ప‌గ తీర‌లేద‌ని తాజాగా ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌ను ఏ విధంగా టార్గెట్ చేసింది ఆయ‌న వివ‌రించారు.

వికారాబాద్ జిల్లా తాండూరులో జరుగుతున్న బీజేపీ శిక్షణ తరగతుల్లో ఈటల రాజేందర్ పాల్గొని ప్ర‌సంగించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కేసీఆర్ ను గద్దె దింపేందుకు నిరంతరం పోరాటం చేస్తామని ఈటల రాజేందర్ వెల్ల‌డించారు. త‌నకు ఫాలోయింగ్ పెరుగుతుందనే ఉద్దేశంతో త‌న‌ పేపర్, టీవీల‌లో రాకుండా చేశాడని గుర్తు చేశారు.

ఒక్క కేసీఆర్ మీడియాలో రాకుంటే నష్టం ఏమీలేదని…ప్రస్తుత రోజుల్లో ప్రతి వ్యక్తి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందన్నారు. యువత తలుచుకుంటే సోషల్ మీడియాలో కేసీఆర్ పని తీరును ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారని ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు.

ఈటల రాజేందరన్న వార్త‌లు టీవీల్లో, పేపర్లలో వస్తలేదనుకోవద్దని.. యువత చేతుల్లో ఉండే స్మార్ట్ ఫోనే ఏకే 47లా ఉపయోగపడుతుందని బీజేపీ శ్రేణుల‌కు ఈట‌ల రాజేంద‌ర్ భ‌రోసా ఇచ్చారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని మనం అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదని.. ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు.

మనం చెప్పాల్సింది సమాజానికి ఏది అవసరమో.. చైతన్యం కలిగించేలా ఉండాలని తెలిపారు. ఒకప్పటి కాలం వేరు…ఇప్పటి జనరేషన్ వేరు అని పేర్కొన్న ఈటల రాజేందర్ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు.