వైసీపీ సీనియర్ నాయకుడు.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఇటీవల మంత్రి వర్గం నుంచి తొలగించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన అలక వహించడం… తాడేపల్లి నుంచి రాయబారాలు జరగడం.. వంటివి తెలిసిందే. తన పదవికి రాజీనామా కూడా చేస్తున్నట్టు ఆయన తన అనుచరులతో చెప్పించారు. అయితే.. ఆ తర్వాత.. ఈ విషయంపై.. తాను మధన పడడం లేదని.. అన్నారు. దీనికి కారణం.. సీఎం జగన్‌త బాలినేని భేటీ కావడమే! తర్వాత.. అంతా సర్దుమణిగింది.
ఇటీవల సీఎం జగన్.. బాలినేని సొంత నియోజకవర్గం ఒంగోలులో పర్యటన కూడా చేశారు.. ఇక్కడ నుంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. దానిలో మంత్రి కన్నా ఎక్కువగా.. బాలినేని వ్యవహరించారు. ఇక, ఈ క్రమంలో అంతా బాగానే ఉందని.. అనుకున్నారు అందరూ! అయితే.. తాజాగా.. తనను మంత్రి వర్గం నుంచి తీసేయడంపై మరోసారి బాలినేని స్పందించారు. తనకు బాధ తగ్గిందన్న ఆయన.. తన అనుచరులు మాత్రం ఇంకా బాధపడుతూనే ఉన్నారని అన్నారు.
తాను సీఎం జగన్ రెడ్డికి బంధువును కాబట్టే మంత్రి పదవి నుంచి తొలగించానని సీఎం చెబుతున్నారని బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. మీడియాతో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థను జగన్ ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. వైసీపీ నేతలు చెప్పిన వారినే వలంటీర్లుగా నియమించామన్నారు. వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే ముఖ్య కారకులు వలంటీర్లేనని ఆయన అభిప్రాయపడ్డారు.
మంత్రి పదవిలో నుంచి నన్ను ఎందుకు తీసేశారని కొంతమంది అడుగుతున్నారని, బంధువును కాబట్టే మంత్రి పదవి నుంచి తొలగించానని సీఎం చెబుతున్నారన్నారు. తనకు ఈ విషయంలో బాధలేదని.. అయితే.. తన అనుచరులు మాత్రం కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. వైసీపీ బలోపేతానికి జిల్లాలో గడపగడపకు తాను తిరుగుతానని ఆయన స్పష్టం చేశారు. తనను గెలిపించే బాధ్యత వలంటీర్లు, సచివాలయ సిబ్బందిదేనని బాలినేని పేర్కొన్నారు.