భారత రాష్ట్ర సమితి.. పార్టీ ఏర్పాటు చేస్తే.. ఎలా ఉంటుందంటూ.. టీఆర్ ఎస్ ప్లీనరీలో సంచలన వ్యాఖ్యలు చేసిన.. సీఎం కేసీఆర్.. 24 గంటలు కాకముందే.. జాతీయ రాజకీయ ముచ్చట్ల జోరును పెంచారు. తాజాగా ఆయన జార్ఖండ్ యువ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌తో ప్రగతి భవన్ లో బేటీ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనతో చర్చలు జరిపారు. జాతీయ రాజకీయాలు, కేంద్రం విధానాలు, ఇతర అంశాలు సమావేశంలో చర్చకు వచ్చాయని.. సమాచారం.
మోడీని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాల్లో.. జార్ఖండ్ కీలకంగా ఉంది. పైగా.. ఇక్కడ బీజేపీకి పట్టు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరింత దూకుడు పెంచి.. కేసీఆర్‌తో చేతులు కలపాలని నిర్ణయించుకున్నారు. ఇక, దేశంలో సమూల మార్పు కోసం ప్రత్యామ్నాయ రాజకీయ అజెండా ఉండాలంటూ.. టీఆర్ ఎస్ ప్లీనరీలో కేసీఆర్ పేర్కొనడం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితిలాగే.. భారత రాష్ట్ర సమితి రావాలనే ప్రతిపాదనలు వస్తున్నాయని అన్నారు.
దీంతో కేసీఆర్ పక్కాగా జాతీయ పార్టీ పెట్టే యోచనలో ఉన్నారనే మాట జాతీయ స్థాయిలో హల్చల్ చేసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు కదులుతుండడం గమనార్హం. ఇక జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన కేసీఆర్.. గత నెల 4 న జార్ఖండ్ రాజధాని రాంచీలో పర్యటించారు. ఈ క్రమంలోనే త్వరలోనే హైదరాబాద్‌కు రావాలంటూ.. సీఎం హేమంత్‌కు కేసీఆర్ ఆహ్వానం పలికారు. ఈ క్రమంలోనే యువ సీఎం హైదరాబాద్‌కు వచ్చారు.
దేశ రాజకీయాలు, బీజేపీకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేసే అంశాలపై కేసీఆర్.. హేమంత్ సొరేన్తో చర్చించారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్. మంత్రి కేటీఆర్, తదితరులు హేమంత్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం.. అంతర్గత మందిరంలో చర్చలకు దిగారు. హేమంత్ గౌరవార్థం సీఎం కేసీఆర్ .. రాత్రి డిన్నర్ ఏర్పాటు చేశారు.